టీఆర్‌ఎస్‌కు విలీన సవాల్..?
* పెద్దగా అవరోధాలు ఉండవంటున్న పార్టీ నేతలు
* విలీనం ప్రస్తావనే ఉండదంటున్న మరికొందరు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర కేబినెట్ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం మరోసారి తెరమీదకు వచ్చింది. ఆంక్షల్లేకుండా 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటుచేస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామంటూ టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజా కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం శాంతిభద్రతలు, విద్య వంటి అంశాలు అభ్యంతరకరమని కేసీఆర్ బహిరంగ ప్రకటన చేసినా విలీనానికి ఇది పెద్ద అవరోధం కాదని పార్టీ నేతలు చెబుతున్నారు.
‘‘మనం కోరుకున్నట్టుగా తెలంగాణ వచ్చినట్టే. అయితే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా వేచి చూడాల్సి ఉంది. కేబినెట్ ఆమోదం దాకా వచ్చి ఆగిపోతదని ఎవరూ అనుకోరు. అయితే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది పరస్పర రాజకీయ ప్రయోజనాల మీదనే ఆధారపడి ఉంటాయి. తెలంగాణ ఏర్పాటు అనే పెద్ద నిర్ణయమే తీసుకున్న తర్వాత చిన్నచిన్న ఆంక్షలు పెద్ద విషయం కాదు. బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌తో మాట్లాడ్తారేమో. అప్పటిదాకా విలీనంపై ఇప్పుడే చర్చ ఉండకపోవచ్చు’’ అని కేసీఆర్ సన్నిహిత నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
‘‘హైదరాబాద్‌లోని శాంతిభద్రతలు, ఉన్నత విద్య, సాంకేతిక విద్యవంటివాటిపై ఇన్ని ఆంక్షలు పెట్టినవారు విలీనం చేయాలంటూ అడుగుతారా? అయినా మేం విలీనం చేస్తామని అన్నప్పుడు తెలంగాణ ఇచ్చారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలకోసం తెలంగాణ ఏర్పాటుచేసి మమ్మల్ని విలీనం ఎలా అడుగుతారు? హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టి, 1000 మంది విద్యార్థులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ నైతిక అర్హత ఉందా? ఇప్పటిదాకా చేసిన నిర్ణయాలు కేసీఆర్‌ను అడిగి చేశారా? కాంగ్రెస్‌కు ఇష్టం ఉన్నట్టు చేసుకున్నంక మా విలీనం ఎందుకు? విలీనం ప్రస్తావనే ఉండదు’’ అని కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మరో నాయకుడు స్పష్టంచేశారు.
అయితే బయటకు ఏం చెబుతున్నా బిల్లు ఆమోదం పొందిన తర్వాత టీఆర్‌ఎస్‌పై నైతిక ఒత్తిడి పెరుగుతుందని, ఎవరెన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్‌లో విలీనం తప్పకపోవచ్చునని కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మరో నాయకుడు వ్యాఖ్యానించారు. ‘‘విలీనం ప్రసక్తి లేదని బయటకు చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత పెరుగుతుందని, ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చప్పున చల్లారిపోతుందని కేసీఆర్‌కు తెలుసు. ప్రజల భావోద్వేగాలపై కేసీఆర్‌కు చాలా స్పష్టత ఉంది. ఇచ్చిన మాట తప్పినపార్టీగా టీఆర్‌ఎస్‌పై ఇతరులు బురదజల్లే అవకాశాన్ని కేసీఆర్ ఇస్తాడని అనుకోను’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే విలీనం అనే దానిపై పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
బిల్లు అధ్యయనంపై కేసీఆర్ దృష్టి
మరోవైపు కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013’ను అధ్యయనం చేయడంపై టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టిని సారించారు. పార్టీ ముఖ్యులు టి.హరీష్‌రావు, నాయిని నర్సింహా రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, ఎ.కె.గోయల్, రామలక్ష్మణ్, శేరి సుభాష్ రెడ్డి, వి.ప్రకాశ్ తదితరులతో కేసీఆర్ గురువారం తన నివాసంలో సమావేశమయ్యారు.
కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయంపైనే రోజంతా చర్చించిన కేసీఆర్ టీవీ చానెళ్లలో కేంద్ర హోంమంత్రి ప్రకటనను పరిశీలించారు. కేవలం టీవీ చానెళ్లలోనే చూసినదానిపై పార్టీ వైఖరిని, పంథాను చెప్పకూడదని ఈ సందర్భంగా భావించారు. పార్టీ పొలిట్‌బ్యూరో, ప్రజాప్రతినిధుల సమావేశంలో ముసాయిదా బిల్లుపై పూర్తిగా అధ్యయనం చేసి, స్పందించాలని నిర్ణయించారు. జిల్లాల సరిహద్దులు, హైదరాబాద్‌పై ఆంక్షలు, శాంతిభద్రతలు, ఉన్నత విద్య, సాంకేతిక విద్య వంటివాటిలో ఆంక్షలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు.
నేడు పొలిట్‌బ్యూరో
హైదరాబాద్ పదేండ్లు ఉమ్మడి రాజధానిగా, తెలంగాణ 10 జిల్లాలతో కూడిన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొం టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా, వాటి పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ, విలీనం చేయాల్సిన అవసరముందా, విలీనం కాకుం టే భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తెలంగాణ 10 జిల్లాలకు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపే అవకాశముందని ప్రచారం జరిగిన నేపథ్యంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి పొలిట్‌బ్యూరో, ప్రజాప్రతి నిధుల సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఎలాంటి అనుమానాలకు, అయోమయానికి తావులేకుండా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ ఉద్యమ, రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. పొలిట్‌బ్యూరో సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుందని రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తెలిపారు.