నేనిప్పుడు ఏ పార్టీకీ చెందను
వెంకయ్య నాయుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, తిరుమల: ‘నేనిప్పుడు ఏ పార్టీకీ చెందను. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తిని. రాజ్యాంగానికి లోబడి ఆ పదవికున్న ఔన్నత్యాన్ని పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’ అని కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వెంకయ్య సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతీ వైద్య విద్యార్థినుల హాస్టల్ భవనాన్ని సోమవారం వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, మాధవసేవకు నిలయమైన స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మేకింగ్ ఆఫ్ డెవలప్‌డ్ ఇండియా ఆలోచనతో ముందుకు సాగాలనీ, ‘సబ్ కామ్ సర్కార్ కరేగా’ అన్న భావనను వదిలి, ‘వియ్ ఆర్ మిషన్...నాట్ ఫర్ కమీషన్’ అంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వెంకయ్యనాయుడిని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, కలెక్టర్ ప్రద్యుమ్న తదితరులు సత్కరించారు. పలువురు విద్యార్థినులు వెంకయ్యకు రాఖీ కట్టారు.