
ఆ ఒక్క పదవి దక్కలేదు: వెంకయ్య
తిరుపతి: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం.వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నగరంలోని రూయా ఆస్పత్రిలో వైద్య విద్యార్థులకు వెంకయ్యనాయుడు ల్యాప్‌టాప్‌లు అందించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఆ ఒక్క పదవి మాత్రమే తనకు దక్కలేదని అన్నారు.
అయితే ఫలానా పదవి అని ఆయన నేరుగా చెప్పకపోయినా.. సభా ప్రాంగణంలో ఉన్న వారంతా ప్రధాని పదవి అయి ఉంటుందని చెవులు కొరుక్కున్నారు. ఆరెస్సెస్‌లో కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించిన వెంకయ్యనాయుడు దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన విషయం తెలిసిందే. అంతకు మందు ఎస్వీ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారు. అదేవిధంగా.. ఎస్వీ మెడికల్ కళాశాలలో నిర్మించిన నూతన భవనాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు.