అన్నకు అంతర్యుద్ధాంజలి
Published Sun, Jan 19 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
‘పరాజయానికి మించిన పాఠం లేదు’ అంటారు. అయితే ఈ మాట వరుసగా రెండు ఎన్నికల్లో చతికిలబడ్డా తెలుగుదేశం నేతల చెవికి ఎక్కినట్టు లేదు. అందుకే మరోమారు ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలోనూ.. కలసికట్టుగా వ్యవహరించడానికి బదులు ‘కలహాల జట్లు’గా బజార్న పడుతున్నారు. తెలుగుజాతిని ఏకతాటిపై నడిపించాలన్నది పార్టీ వ్యవస్థాపకుడు, ‘అన్న’ దివంగత ఎన్టీఆర్ ఆశయమైతే.. ఒకేపార్టీలో అనేకవర్గాలుగా వ్యవహరించడమే తమ నైజం అన్నట్టుంది జిల్లాలో తెలుగుతమ్ముళ్ల తీరు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రజల విశ్వాసం కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారశైలి మారడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు నియోజకవర్గాల్లో పెత్తనం కోసం సిగపట్లు పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతరాలు పైకి పొక్కకపోయినా, కొన్ని చోట్ల కొందరి ఆధిపత్య పోరు రోడ్డున పడుతోంది. మిగిలిన సందర్భాల్లో మాటెలా ఉన్నా కనీసం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్‌టీఆర్ వర్ధంతినైనా సమన్వయంతో నిర్వహించలేక నేతలు పరస్పరం తోపులాటలు, వాగ్వివాదాలకు దిగడం చూసి నిస్పృహకు లోనైన పార్టీ కేడర్ ప్రత్యామ్నాయం దిశగా అడుగులువేస్తున్నారు. శనివారం ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం, రాజమండ్రిసిటీ నియోజకవర్గాల్లో పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు వెల్లడైంది. శ్రద్ధాంజలి ఘటించాల్సిన వేళ అంతర్యుద్ధభేరి మోగించినట్టు.. వర్గపోరుతో బజారుకెక్కారు.
‘వస్తున్నా మీ కోసం’ తర్వాత ముదిరిన విభేదాలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గత ఏప్రిల్‌లో జిల్లాలో ‘వస్తున్నా మీ కోసం’ యాత్ర నిర్వహించారు.బాబు వెళ్లిననాటి నుంచి నేతల మధ్య విభేదాలు ముదురుపాకానపడడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా పిఠాపురం సీటు తనదేనని ధీమాతో ఉన్న వీవీఎస్ వర్మకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వెన్నా నాగేశ్వరరావు కుమారుడు జగదీష్ రూపంలో పోటీ ఎదురైంది. నిన్నగాక మొన్న వచ్చిన జగదీష్ టిక్కెట్టు బరిలో నిలవడం సహజంగానే వర్మకు కంటగింపుగా మారింది. చంద్రబాబు ఆశీస్సులతోనే జగదీష్ రేసులో ఉన్నారనే ప్రచారంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వర్మ వ్యవహారశైలి కూడా ఇందుకు తోడైంది. పార్టీ కార్యక్రమాల్లో తనను కలుపుకొని వెళ్లాలని కోరేందుకు జగదీష్ పలు పర్యాయాలు వెళ్లినప్పటికీ ఏ కోశానా ఇష్టపడని వర్మపై కొంతకాలంగా పార్టీ స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని వెన్నా స్వగ్రామం జల్లూరు వేదికగా ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా వెళ్లగక్కారు.
పార్టీని కాపాడాలంటూ ఎన్టీఆర్ విగ్రహానికి
వినతిపత్రం
జగదీష్ జల్లూరులో ఎన్టీఆర్ వర్ధంతి ఏర్పాట్లలో ఉండగా, వర్మ తన అనుచరులతో వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయబోయారు. దానికి స్థానిక నాయకులు అడ్డుతగిలారు. విగ్రహదాత తాటికాయల సత్యనారాయణే రివాజుగా తొలుత మాల వేయాలనగా, అందుకు అంగీకరించినట్టే అంగీకరించిన వర్మ తాను కూడా పూలమాల వేసేందుకు ముందుకు రావడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. జల్లూరులో వర్ధంతి సజావుగా జరుపుతుండగా జరిగిన రాద్ధాంతానికి వర్మే కారణమని, ఆయన పార్టీ పరువును బజారుకెక్కించారని జగదీష్ వర్గీయులు మండిపడుతున్నారు. సౌమ్యుడైన జగదీష్‌ను ఇబ్బంది పెడుతూ పోతే వర్మకు గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా పార్టీని వర్మ నుంచి రక్షించాలంటూ జగదీష్‌తో పాటు పలువురు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం గమనార్హం.
‘అన్న’ విగ్రహం సాక్షిగా వాగ్వాదం
ఇక రాజమండ్రిలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పార్టీ నాయకుడు గన్ని కృష్ణ వర్గీయుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. పార్టీని విడిచి వెళ్లి, తిరిగొచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ గన్ని వర్గీయుడైన కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రాజమండ్రి 42వ డివిజన్ శ్రీరామ్‌నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వర్రే మాట్లాడుతూ మాజీ మేయర్ చక్రవర్తి, యర్రా వేణుగోపాలరాయుడుల పేర్లు ప్రస్తావించకుండానే పార్టీలోకి తిరిగొచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
పార్టీలోకి తిరిగొచ్చీ రాగానే యర్రాకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టారనే ఆగ్రహంతో ఉన్న గన్ని వర్గం ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా గోరంట్లపై పరోక్షంగా దాడికి దిగినట్టయింది. వర్రే వ్యాఖ్యలతో గోరంట్ల వర్గీయులు మండిపడ్డారు. దీంతో ఇరువర్గాల నడుమా వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామంతో వేదికపై ఉన్న రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మురళీమోహన్ ఖిన్నులయ్యారు. చక్రవర్తి స్పందిస్తూ తాను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పుకొన్నారు. వర్రే వ్యాఖ్యలతో చాలా ఏళ్లుగా గన్ని, గోరంట్లల మధ్య ఉన్న వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. ఈ పరిణామం భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement