- జిల్లాలో సీటివ్వని బాబు
- బాలయ్యతో హరికృష్ణకు చెక్
- కుటుంబసభ్యుల మధ్యే విభేదాలకు ఆజ్యం
- బావ తీరుపై హరి కారాలు మిరియాలు
ఎన్టీఆర్ పురిటిగడ్డలో ఆయన వారసులకు చోటు దక్కలేదు.. తారక రాముడు పెట్టిన పార్టీలో ఆయన కొడుకులకు ప్రాధాన్యత లేదు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి బాలయ్య, హరికృష్ణలకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు నైజం మరోమారు బయటపడింది. కాంగ్రెస్ నుంచి వచ్చి చేరి పిల్లను, పదవిని ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చివరకు ఎన్టీఆర్ వారసులను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. టీడీపీలో తన పెత్తనానికి తిరుగులేకుండా చేసుకునేందుకు బాలకృష్ణను అడ్డుపెట్టి హరికృష్ణ దూకుడుకు బ్రేక్ వేసేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తులపై నందమూరి అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు సొంత జిల్లాలోని గుడివాడతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో రెండు పర్యాయాలు ఆయన గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మరణంతో చంద్రబాబుపై కోపంతో హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అటు తరువాత ఎన్టీఆర్ వారసులు ఎవరూ జిల్లా నుంచి పోటీ చేయలేదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసులు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు.
జిల్లా వదిలి.. హిందూపురంతో సరి..
బావ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమేనని తొడకొట్టిన బాలయ్య చివరకు హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్నారు. దీనికితోడు పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు వర్గపోరుతో చిరాకు వచ్చిన ప్రతిసారి అవసరమైతే బాలకృష్ణను, లేకుంటే లోకేష్‌ను పోటీకి తీసుకొస్తానని ప్రకటించేవారు. గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సైతం వంశీతో వర్గపోరు నేపథ్యంలో బాలకృష్ణను పోటీకి తీసుకొస్తానని రాజకీయ వేడి రగిల్చేవారు. గుడివాడ నుంచి కూడా బాలకృష్ణ పోటీకి దిగుతారన్న ప్రచారం జరిగింది.
ఈసారి ఏదోక చోట నుంచి బాలకృష్ణ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అనుయాయులు పెనమలూరు, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో సర్వే కూడా చేయించుకున్నారు. పెనమలూరు, నూజివీడులో రెబల్స్ బెడద తీవ్రంగా ఉండటం, గుడివాడలో కొడాలి నాని గాలి ఎక్కువగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీకి బాలకృష్ణ ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఓటమి భయమో, వర్గపోరు ప్రభావమో, మరేదైనా కారణమో కానీ బాలకృష్ణ జిల్లాను వదిలి హిందూపురం టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బాలయ్యను ఉసిగొల్పి బాబు రాజకీయం..
ప్రచారం, పర్యటన, ఎన్నికలు ఏదైనా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు బాలకృష్ణతో చంద్రబాబు చెక్ పెట్టించి రాజకీయం నెరపడంపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం పెరుగుతోంది. వస్తున్నా మీకోసం అంటూ జిల్లాలో యాత్రకు వచ్చిన చంద్రబాబు పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో బాలకృష్ణను ప్రయోగించారు. అప్పట్లో బాబు యాత్ర సందర్భంగా రెండు రోజులు ఇక్కడే ఉన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేలా కేడర్‌కు ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు రేగాయి. బాబు, బాలయ్య తీరుపై ఎన్టీఆర్ అభిమానులు పెద్ద దుమారమే లేపారు. తాజాగా హరికృష్ణకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు చెక్ పెట్టి బాలకృష్ణకు ఇచ్చి ఎన్టీఆర్ కుటుంబంలో కొత్త చిచ్చు రాజేశారు.
కారాలు మిరియాలు నూరుతున్న హరికృష్ణ...
హరికృష్ణ నోటికి జడిసి పైకి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు నటించే చంద్రబాబు అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన్ను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తారని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. సమైక్యాంధ్ర కోసం అందరూ పదవులకు రాజీనామాలు చేసినా అంతగా పట్టించుకోకపోయినా, హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆగమేఘాలపై ఆమోదించేలా చేశారు. సమైక్యాంధ్ర కోసం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు నుంచి యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడంతో అందుకు చంద్రబాబు అడ్డుచక్రం వేశారు.
ఈసారి హిందూపురం కాకుంటే జిల్లాలో టిక్కెట్ ఇస్తారని హరికృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తీరా బాలకృష్ణకు సీటిచ్చిన బాబు హరికృష్ణకు మాత్రం హ్యాండిచ్చారు. దీంతో బావ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న హరికృష్ణ తనకు జిల్లాలో టిక్కెట్ ఇస్తారని ఆశించానని, అది కూడా ఇవ్వకపోవడం దారుణమని కారాలు మిరియాలు నూరుతుండటం కొసమెరుపు.