bala krishnan
-
ఆర్కిటెక్చర్ వాక్.. అడుగు అడుగులో నిర్మాణం
నడవాలి.. నడతలు మార్చడానికి నడవాలి.. నడతలు నేర్పడానికి ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్ ‘నడక’ గురించి తెలుసుకుంటే ఈ మాటలు ముమ్మాటికి నిజం అనిపిస్తుంటుంది. 1700 కిలోమీటర్లు... కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు దాదాపు రెండు నెలల ప్రయాణం 54 ఏళ్ల వయసులో వందల కిలోమీటర్ల నడక దేనికోసం..? ‘నవభారత నిర్మాణం’ కోసం అంటూ ఆర్కిటెక్చర్ వాక్ గురించి ఆనందంగా వివరిస్తారు ఆమె. గీతా బాలకృష్ణన్ పుట్టింది చెన్నైలో. చదివిందంతా హైదరాబాద్‌లో. 1982లో కలకత్తాకు వెళ్లిపోయి, అక్కడే ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగుతున్నారు. దేశంలో భవన నిర్మాణ రంగం గురించి రాబోయే తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ఒంటరిగా 1,700 కిలోమీటర్లు నడిచిన ఈ ఆర్కిటెక్ట్ దారి గురించి మరింత వివరంగా.. ► ప్రయాణంలో గ్రహించిన విషయాలు.. అనుకున్న ప్లాన్ ప్రకారం గత శనివారం ఉదయం 5:30కి ఢిల్లీకి చేరుకోవడంతో నా ‘వాక్’ పూర్తయింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో తప్ప ఆర్కిటెక్చర్ గురించి చాలా మందికి తెలియదని ఈ ‘వాక్’ ద్వారా మరింతగా అర్థమయ్యింది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటారు తప్ప ఆర్కిటెక్ట్ కావాలని, అదొక రంగం ఉంటుందని తెలియదు. చిన్న చిన్న టౌన్లు మొదలు పల్లెల్లో జనానికి భవన నిర్మాణాల డిజైన్స్ గురించి, ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలనుకుని ఫిబ్రవరి 13న ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఈ ప్రయాణం మొదలైన మొదటి రోజు భవన నిర్మాణాలు జరుగుతున్న చోటుకు వెళ్లాను. ‘ఎందుకు కడుతున్నారు, ఏం పనిచేస్తున్నారు.. ప్లానింగ్ ఏంటి?’ అని అడిగితే ‘అవేమీ మాకు తెలియదు. కాంట్రాక్టర్ వస్తారు. ఇంత ఎత్తులో కట్టండి, అలా పని చేయండి.. అని చెబితే అలాగే చేస్తాం’ అని చెప్పారు. ఆర్కిటెక్ట్ వచ్చి వారితో మాట్లాడి, తగిన డిజైన్ ఇస్తే కదా.. ఆ పనివాళ్లలో నిర్మాణం పట్ల ప్రేమ కలిగేది. ఇల్లు, భవనం అంటే.. నాలుగు గోడలు రూఫ్ మాత్రమే కాదు కదా! ఇది కూడా బాధ్యతగా చేయాల్సిన పని అని ఎవరికీ తెలియడం లేదు. ► ఈ ‘వాక్’ వల్ల జనాల్లో అవగాహన వస్తుందంటారా? నా ఒక్కదాని వల్ల అందరిలోనూ అవగాహన వస్తుందని చెప్పలేను. కానీ, జనాల్లోకి కొంతవరకు సందేశం వెళుతుంది. ప్రభుత్వం, ఆర్కిటెక్ట్ అసోషియేషన్స్.. అందరూ కలిసి అవగాహన కల్పించడానికి ఇదో మార్గం అనుకున్నాను. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆర్కిటెక్చర్ ఈ రెండు కౌన్సిల్స్ నేను చేసే వాక్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జర్నీలో చాలా సమస్యలు ఉన్న ప్రాంతాలను సందర్శించాను. వాటిని గుర్తించి, ఒక డాక్యుమెంట్ చేసే పనిలో ఉన్నాను. నాకు ఇది ఒక పరిశోధనగా ఉపయోగపడింది. ఈ వాక్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ► మీ రోజువారీ ప్రయాణం ఎలా ఉండేది? మొదట ఉదయం 6 గంటలకు ప్రారంభించినా, ఎండకారణంగా ఉదయం 4 గంటలకే నడక మొదలుపెట్టేదాన్ని. ఈ జర్నీలో చాలామంది నుంచి చాలా ప్రేమ దక్కింది. కొందరు వచ్చి యోగక్షేమాలు అడిగేవారు. కొందరు మంచి నీళ్లు, టీ ఇచ్చేవారు. మరికొందరు టిఫిన్‌కు ఆహ్వానించేవారు. కొన్ని చోట్ల వాళ్ల ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసి, మరీ పిలిచారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రజల్లో ఉన్న ఇంత మంచిని నేరుగా చూడగలిగాను. నేను నడుస్తూ వెళుతుంటే స్థానిక మీడియా వాళ్లు చూసి, విషయమేంటో కనుక్కొని, నన్ను అనుసరిస్తూ నా గురించి పేపర్లలో రాశారు. నేను ముందుకు వెళ్లినప్పుడల్లా స్థానికులు ‘మీ గురించి చదివాం, చూశాం..’ అని చెబుతుండేవారు. ► ప్రయాణంలో అద్భుతం అనిపించినవి? మార్గంలో నా చూపంతా భవననిర్మాణాలవైపుగా ఉండేది. వెస్ట్ బెంగాల్ ఆర్కిటెక్చర్, జార్ఞాండ్లోని ఆర్కిటెక్చర్ చాలా భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో భర్రా అని గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కట్టిన ఒక ఇంటికి వెళ్లాను. మట్టితో కట్టిన ఇల్లు అది. వాళ్ల కుటుంబసభ్యులే కలిసి స్వయంగా కట్టుకున్నారు. రూఫ్‌కి కూడా వాళ్లే తయారు చేసుకున్న మట్టి పెంకులు వాడారు. ఇంట్లో బెడ్ నుంచి ప్రతీది వారి రూపకల్పనే. అలాంటి ఇళ్లు అక్కడ మరికొన్ని చూశాను. ఇంటి నిర్మాణాల్లో వారి ప్రతిభ చాలా వండర్ అనిపించింది. ► వందల కిలోమీటర్ల వాక్ ఒంటరిగా చేయడానికి మీ కుటుంబం ఒప్పుకుందా? ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. ఇన్నేళ్లకు ఓ ఉదయం లేచి సడెన్‌గా ఇంట్లోవారికి నా కల గురించి చెబితే వెంటనే సపోర్ట్ చేయరు. మొదటి నుంచి నా కుటుంబ సభ్యులకు నా ఇష్టాయిష్టాలేంటో తెలుసు. నేను చేస్తున్నపని తెలుసు. అలాగే, సొంతంగా తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసు. వారితో నా రంగానికి సంబంధించిన విషయాలనూ చర్చిస్తూనే ఉంటాను. నా భర్త, నా కొడుకు కూడా నాతో కలిసి 200 కిలోమీటర్ల వరకు వచ్చారు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ప్రమాదాల గురించి మనం భయపడినా, ఇంట్లో వాళ్లు ఆపేసినా ముందడుగు వేయలేం. గ్యాలియర్‌లో ఒక సైక్లింగ్ యాక్సిడెంట్లో కింద పడిపోయాను. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందన్నారు. చేరాల్సిన గమ్యం ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. బ్రేక్ వస్తుందేమో అనుకున్నాను. కానీ, పర్వాలేదు. 4–5 రోజుల్లో కోలుకుని, నా నడకను కొనసాగించాను. ► మీరు మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లారు కదా... అక్కడి వారికి ఏం చెప్పారు? గ్రామాల్లో ఎవరైనా పిల్లవాడిని ‘భవిష్యత్తులో ఏమవుతావు’ అంటే ‘టీచర్’ అనే సమాధానం ఎక్కువ విన్నాను. అంటే, వాళ్ల కళ్ల ముందు రోజూ టీచర్ ఒకరే కనిపిస్తారు. మరో వృత్తి గురించి వారికి అంతగా తెలియదు. అందుకే, టీచర్లను కలిసి ఆర్కిటెక్చర్ వృత్తి గురించి, బిల్డింగ్ డిజైన్ గురించి పిల్లలకు చెప్పమని, వారిని ట్రెయిన్ చేయమని వివరించాను. ► మీరు రన్నర్ అని కూడా విన్నాం. ఈ వాక్‌కి మీరు ముందు చేసిన కార్యక్రమాలు..? 2014లో రన్నింగ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు చిన్న చిన్న వ్యాయామాలు చేసేదాన్ని. అప్పటినుంచి 10 కిలోమీటర్ల వాక్, 20 కిలోమీటర్లు రన్, 30 కిలోమీటర్ల మారథాన్ చేశాను. ఇలా లాంగ్ వాక్ చేయడం మాత్రం మొదటిసారి. ఈ వాక్‌లో ఒక రోజు వాక్ అండ్ రన్, మరో రోజు వాక్. మిక్స్‌డ్‌గా చేశాను. రోజూ 20–30 కిలోమీటర్లు నడిచాను. ఈ వాక్ రాబోయే రోజుల్లో చేసే పనులకు ముందడుగు అనుకుంటున్నాను. ► ఆర్కిటెక్ట్‌గా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నవి..? ఈ వాక్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక డాక్యుమెంటరీ చేయడానికి మరో 3–4 నెలల సమయం పడుతుంది. వాక్ గురించి కాకపోయినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక... లలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నాను. దేశంలోని అన్ని జిల్లాలకు వెళ్లాలని, ఆర్కిటెక్చర్ రంగం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ రంగంలోకి రావాలని, ప్రతిభ కనబరుస్తున్న స్టూడెంట్స్‌కి ఫెలోషిప్స్ ఇస్తూ ప్రోత్సహించాలి. ఎక్కడ ఆర్కిటెక్చర్ రంగంలో సమస్యలు ఉన్నాయో గుర్తించి, పరిష్కరిస్తూ వెళ్లాలనుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ తమ సిఫార్సులను సీఎం జగన్‌కు వివరించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై కమిటీ సిఫార్సులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సిఫార్సుల్లో కూడా కమిటీ భాగస్వామ్యం కావాలని అన్నారు. రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. స్కూళ్లలో ప్రారంభించిన నాడు –నేడు కార్యక్రమం కొనసాగాలి. పిల్లలకోసం ఏర్పాటు చేసే ఫర్నీచర్ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు. పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి’అని సీఎం అన్నారు. ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి.. ‘ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఉన్న నాణ్యత, ప్రమాణాలను కూడా పరిశీలించాలి. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో క్వాలిటీని పరిశీలించాలి, పర్యవేక్షించాలి. అగ్రికల్చర్ కాలేజీకి 100 ఎకరాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలి. దీనిపై రెగ్యులేటరీ కమిటీ నియంత్రణ ఉండాలి. చదువు అనేది కచ్చితంగా ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి. ప్రైవేటు వర్సిటీల్లో క్వాలిటీ లేనప్పుడు సర్టిఫికెట్లకు ఏం వాల్యూ ఉంటుంది. విద్యా అనేది వ్యాపారం, డబ్బు కోసం కాదు. ఇది ఒక ఛారిటీ. ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఖాలీలను భర్తీ చేయాలి. విద్యాశాఖలోని అధికారులు వారధిలా పనిచేయాలి’అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కాలేజీల్లో చేపట్టిన తనిఖీల అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐపీఎల్ అంటూ ఐఐటీ పరీక్షల కోసం ప్రీమియర్ లీగ్‌లు పెడుతున్నారని తెలిపారు. ఫీజుల విషయాన్ని కూడా సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. రూ.40వేల నుంచి లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. కాని ప్రభుత్వానికి మాత్రం రూ.2వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి కాలేజీలపై కఠినంగా వ్యవరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. -
థ్రిల్లర్ సినిమా కోసం నటి సంధ్య హత్య?
చెన్నై ,టీ.నగర్: నటి సంధ్య హత్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ సినిమా రూపొందించేందుకు దర్శకుడు బాలకృష్ణన్ నిర్ణయించినట్లు సినీవర్గాలలో ఆదివారం సంచలన వార్తలందాయి. పెరుంగుడి చెత్తకుప్పలో ఇటీవల లభించిన నటి సంధ్య మృతదేహం విడిభాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సంఘటనపై తీవ్ర విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.ఇలావుండగా సంధ్య మృతదేహాన్ని ఏడు భాగాలుగా కత్తిరించేందుకు అతని స్నేహితుడు ఒకరు చెప్పిన స్క్రీన్‌ప్లేనే కారణమని భావిస్తున్నారు. కాదల్ ఇలవశం పేరుతో చిత్రాన్ని నిర్మించిన బాలకృష్ణన్ అది పరాజయం పొందడంతో తీవ్ర నష్టాన్ని చవిచూశారనే విషయం గమనార్హం. -
ఎన్టీఆర్ వారసులకు మొండిచేయే...
జిల్లాలో సీటివ్వని బాబు బాలయ్యతో హరికృష్ణకు చెక్ కుటుంబసభ్యుల మధ్యే విభేదాలకు ఆజ్యం బావ తీరుపై హరి కారాలు మిరియాలు ఎన్టీఆర్ పురిటిగడ్డలో ఆయన వారసులకు చోటు దక్కలేదు.. తారక రాముడు పెట్టిన పార్టీలో ఆయన కొడుకులకు ప్రాధాన్యత లేదు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి బాలయ్య, హరికృష్ణలకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు నైజం మరోమారు బయటపడింది. కాంగ్రెస్ నుంచి వచ్చి చేరి పిల్లను, పదవిని ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చివరకు ఎన్టీఆర్ వారసులను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. టీడీపీలో తన పెత్తనానికి తిరుగులేకుండా చేసుకునేందుకు బాలకృష్ణను అడ్డుపెట్టి హరికృష్ణ దూకుడుకు బ్రేక్ వేసేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తులపై నందమూరి అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు సొంత జిల్లాలోని గుడివాడతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో రెండు పర్యాయాలు ఆయన గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మరణంతో చంద్రబాబుపై కోపంతో హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అటు తరువాత ఎన్టీఆర్ వారసులు ఎవరూ జిల్లా నుంచి పోటీ చేయలేదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసులు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. జిల్లా వదిలి.. హిందూపురంతో సరి.. బావ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమేనని తొడకొట్టిన బాలయ్య చివరకు హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్నారు. దీనికితోడు పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు వర్గపోరుతో చిరాకు వచ్చిన ప్రతిసారి అవసరమైతే బాలకృష్ణను, లేకుంటే లోకేష్‌ను పోటీకి తీసుకొస్తానని ప్రకటించేవారు. గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సైతం వంశీతో వర్గపోరు నేపథ్యంలో బాలకృష్ణను పోటీకి తీసుకొస్తానని రాజకీయ వేడి రగిల్చేవారు. గుడివాడ నుంచి కూడా బాలకృష్ణ పోటీకి దిగుతారన్న ప్రచారం జరిగింది. ఈసారి ఏదోక చోట నుంచి బాలకృష్ణ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అనుయాయులు పెనమలూరు, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో సర్వే కూడా చేయించుకున్నారు. పెనమలూరు, నూజివీడులో రెబల్స్ బెడద తీవ్రంగా ఉండటం, గుడివాడలో కొడాలి నాని గాలి ఎక్కువగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీకి బాలకృష్ణ ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఓటమి భయమో, వర్గపోరు ప్రభావమో, మరేదైనా కారణమో కానీ బాలకృష్ణ జిల్లాను వదిలి హిందూపురం టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలయ్యను ఉసిగొల్పి బాబు రాజకీయం.. ప్రచారం, పర్యటన, ఎన్నికలు ఏదైనా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు బాలకృష్ణతో చంద్రబాబు చెక్ పెట్టించి రాజకీయం నెరపడంపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం పెరుగుతోంది. వస్తున్నా మీకోసం అంటూ జిల్లాలో యాత్రకు వచ్చిన చంద్రబాబు పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో బాలకృష్ణను ప్రయోగించారు. అప్పట్లో బాబు యాత్ర సందర్భంగా రెండు రోజులు ఇక్కడే ఉన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేలా కేడర్‌కు ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు రేగాయి. బాబు, బాలయ్య తీరుపై ఎన్టీఆర్ అభిమానులు పెద్ద దుమారమే లేపారు. తాజాగా హరికృష్ణకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు చెక్ పెట్టి బాలకృష్ణకు ఇచ్చి ఎన్టీఆర్ కుటుంబంలో కొత్త చిచ్చు రాజేశారు. కారాలు మిరియాలు నూరుతున్న హరికృష్ణ... హరికృష్ణ నోటికి జడిసి పైకి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు నటించే చంద్రబాబు అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన్ను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తారని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. సమైక్యాంధ్ర కోసం అందరూ పదవులకు రాజీనామాలు చేసినా అంతగా పట్టించుకోకపోయినా, హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆగమేఘాలపై ఆమోదించేలా చేశారు. సమైక్యాంధ్ర కోసం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు నుంచి యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడంతో అందుకు చంద్రబాబు అడ్డుచక్రం వేశారు. ఈసారి హిందూపురం కాకుంటే జిల్లాలో టిక్కెట్ ఇస్తారని హరికృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తీరా బాలకృష్ణకు సీటిచ్చిన బాబు హరికృష్ణకు మాత్రం హ్యాండిచ్చారు. దీంతో బావ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న హరికృష్ణ తనకు జిల్లాలో టిక్కెట్ ఇస్తారని ఆశించానని, అది కూడా ఇవ్వకపోవడం దారుణమని కారాలు మిరియాలు నూరుతుండటం కొసమెరుపు. -
రంగారెడ్డి జిల్లా నుంచి బాలయ్య!
కుత్బుల్లాపూర్ లేదా శేరిలింగంపల్లిలో పోటీ చేసే అవకాశం బాలకృష్ణ బరిలో ఉంటారనే ప్రచారంతో ఆశావహుల్లో కలవరం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జిల్లా నుంచి బరిలోకి దిగనున్నారా.. అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం నేతలు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరువు నిలబెట్టే స్థానాలు సాధించాలంటే సొంత కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీచేస్తే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. గతంలో మల్కాజిగిరి లోక్‌సభ లేదా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేయాలని చంద్రబాబు యోచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేస్తే సీమాంధ్ర ప్రాంతంలో తనపై, పార్టీపై వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. దీంతో తన వియ్యంకుడు బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు. ఆయనను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే సీమాంధ్ర ప్రాంతంలో తనకు అడ్డు ఉండదనే ఆలోచన కూడా దీని వెనక ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లా నుంచి బాలకృష్ణ పోటీ చేసే పక్షంలో కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లిలలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ రెండింటిలో ఒక దానికి పోటీచేస్తే ఎలా ఉంటుందనే యోచనలో బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ జిల్లాకు వస్తారని ప్రచారం జరుగుతుండటంతో స్థానిక నేతలు తమ సీటు ఎక్కడ గల్లంతవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. శేరిలింగంపల్లి నుంచి మొవ్వా సత్యనారాయణ, బండి రమేష్, అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద టికె ట్లు ఆశిస్తున్నారు. మల్కాజిగిరి సీటును బీజేపీకి పొత్తులో పోని పక్షంలో మైనంపల్లి హనుమంతరావు, వీకే మహేష్, ముదిరాజ్‌లలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఎంతో కాలం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్థానికంగా పార్టీని కాపాడుకుంటున్న వారిని కాదని, పార్టీ అధినేత తమ వియ్యంకుడిని బరిలోకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఆప్ ‘డిన్నర్’ రాబడి 50 లక్షలు
బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌తో డిన్నర్ కార్యక్రమంలో ఆ పార్టీకి భారీగానే నిధులు సమకూరాయి. నిధుల సమీకరణ కోసం శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో 200 మంది పాల్గొనగా ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.20 వేలు చందాగా వసూలు చేశారు. పార్టీ శ్రేయోభిలాషుల పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఆప్ అభ్యర్థి, ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ నేతృత్వం వహిం చారు. ఈ డిన్నర్ ద్వారా పార్టీకి రూ. 50 లక్షలు సమకూరాయని ఒక శ్రేయోభిలాషి సీఎన్ రాధాకృష్ణన్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. డిన్నర్‌కు హాజరుకాలేకపోయిన మరికొంత మంది త్వరలోనే తమ విరాళాలను పార్టీకి అందజేస్తారని ఆయన చెప్పారు.