రంగారెడ్డి జిల్లా నుంచి బాలయ్య!
- కుత్బుల్లాపూర్ లేదా శేరిలింగంపల్లిలో పోటీ చేసే అవకాశం
- బాలకృష్ణ బరిలో ఉంటారనే ప్రచారంతో ఆశావహుల్లో కలవరం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జిల్లా నుంచి బరిలోకి దిగనున్నారా.. అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం నేతలు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరువు నిలబెట్టే స్థానాలు సాధించాలంటే సొంత కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీచేస్తే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
గతంలో మల్కాజిగిరి లోక్‌సభ లేదా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేయాలని చంద్రబాబు యోచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేస్తే సీమాంధ్ర ప్రాంతంలో తనపై, పార్టీపై వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. దీంతో తన వియ్యంకుడు బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు.
ఆయనను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే సీమాంధ్ర ప్రాంతంలో తనకు అడ్డు ఉండదనే ఆలోచన కూడా దీని వెనక ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లా నుంచి బాలకృష్ణ పోటీ చేసే పక్షంలో కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లిలలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు.
దీంతో ఆ రెండింటిలో ఒక దానికి పోటీచేస్తే ఎలా ఉంటుందనే యోచనలో బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ జిల్లాకు వస్తారని ప్రచారం జరుగుతుండటంతో స్థానిక నేతలు తమ సీటు ఎక్కడ గల్లంతవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. శేరిలింగంపల్లి నుంచి మొవ్వా సత్యనారాయణ, బండి రమేష్, అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద టికె ట్లు ఆశిస్తున్నారు.
మల్కాజిగిరి సీటును బీజేపీకి పొత్తులో పోని పక్షంలో మైనంపల్లి హనుమంతరావు, వీకే మహేష్, ముదిరాజ్‌లలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఎంతో కాలం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్థానికంగా పార్టీని కాపాడుకుంటున్న వారిని కాదని, పార్టీ అధినేత తమ వియ్యంకుడిని బరిలోకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.