పులివెందుల/లింగాల : అరటి కాయల ధరల విషయంలో రైతులకు అన్యాయం చేయడం తగదని, సోమవారంలోగా నిర్ధిష్టమైన ధరలు నిర్ణయించాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. గత వారంలో టన్ను అరటి కాయలు రూ. 14వేలు ఉంటే.. మూడు రోజులనుంచి రూ.7వేలనుంచి రూ. 8వేల వరకు మాత్రమే ధరలు నిర్ణయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. లింగాల, పులివెందుల, వేముల మండలాల రైతులు ఈ విషయాన్ని వైఎస్ వివేకా దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఢిల్లీ వ్యాపారుల మధ్యవర్తులతో ఆదివారం సాయంత్రం స్థానిక కదిరి రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న పెట్రోలు బంకు వద్ద చర్చలు నిర్వహించారు.
రోడ్డుపై బైటాయించి టన్ను అరటి కాయలకు రూ.11,500నుంచి రూ. 15వేల వరకు వెచ్చించి కొనుగోలు చేయాలన్నారు. కోతకు వచ్చిన అరటి కాయలకు ఒక్కసారిగా ధరలు తగ్గించడం దారుణమన్నారు. మధ్యవర్తులనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఓ దశలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడు లారీల టైర్ల గాలి తీసేందుకు యత్నించారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి రైతులను సముదాయించి అలాంటివి చేయరాదని..
రోడ్డుపైనే బైటాయించి నిర్దిష్టమైన ధరలు నిర్ణయించేవరకు లారీలను వెళ్లనీయద్దని రైతులకు పిలుపునిచ్చారు. దీంతో రైతులు రోడ్డుపై వెళ్లే లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. లింగాల ఎంపీపీ సుబ్బారెడ్డి, పులివెందుల మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, లింగాల మండలంలోని అంబకపల్లె, ఇప్పట్ల, పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, వేముల మండలాల అరటి రైతులు పాల్గొన్నారు.