ఇన్‌పుట్ సబ్సిడీకోసం రాస్తారోకో
విడపనకల్లు: ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరులో తమకు అన్యాయం జరిగిందంటూ డొనేకల్లు గ్రామ మెట్ట భూమి రైతులందరూ బుధవారం సాయంత్రం రాస్తారోకోకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి పోయాయి. దీంతో ప్రయాణికులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం మొదలైంది. కొంతమంది ప్రయాణికులు, పోలీసులకు, తహశీల్దార్‌కు స్వయంగా ఫోన్ చేసి పిలిపించారు. రైతులు మాట్లాడుతూ 2014లో ఇన్‌పుట్ సబ్సిడీలో మొత్తం అధికార పార్టీ నాయకులు మాగాణీ భూములకే మంజూరు చేశారని, మెట్ట భూమి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయమై సోమవారం జిల్లాలోని కలెక్టర్‌కు వివరిస్తే గ్రామంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఆర్డీఓను మంగళవారం పంపిస్తామని చె ప్పారు.
అయితే బుధవారం స్వయంగా రెవెన్యూ అధికారులే వచ్చి ఆర్డీఓ విచారణ కోసం వస్తున్నారని, రైతులంతా గ్రామ పంచాయతీ వద్దకు రావాలని చెప్పారు. దీంతో అని పనులు వదులుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూశామన్నారు. చివరికి ఉరవకొండ వరకు వచ్చి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్డీఓ ఉన్న ఫళంగా వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళన విర మించాలని కోరినా, తహశీల్దార్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు భీష్మించుకున్నారు. దీంతో తహశీల్దార్ శంకరయ్య, డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు, ఆర్‌ఐ నాగరాజు ఆందోళనకారుల వద్దకు చేరుకొని స్వ యంగా తానే గురువారం విచారణ చేసి అర్హులైన వారందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డొనేకల్లు క్రిష్ణమూర్తి, సత్యమయ్య, సింపరన్న, మల్లికార్జున, ఎర్రిస్వామి, సురేష్, శేఖర్ పాల్గొన్నారు.