కౌలుపై కుట్ర
కౌలుపై కుట్ర
Published Thu, Oct 6 2016 5:21 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* రాజధానిలో పాలకుల వ్యూహం
* భూ మార్పిడి తరువాత రైతులకు పరిహారం
* ఇవ్వకుండా ఉండేందుకు ప్రణాళికలు
* కూలీల పెన్షన్లకూ ఫుల్‌స్టాప్ పెట్టాలని యోచన
సాక్షి, అమరావతి బ్యూరో: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి పరిధిలోని 29 గ్రామాల రైతుల నుంచి సుమారు 34వేల ఎకరాల భూములను సమీకరించిన విషయం తెలిసిందే. భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. భూములు ఊరికే తీసుకోలేదని, పదేళ్ల వరకు పరిహారం కింద కౌలు చెల్లిస్తామని అప్పట్లో ప్రకటించారు.అదే విధంగా రైతు కూలీలకు ప్రతినెలా పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. జరీబు భూములు కలిగిన రైతులకు ఏడాదికి రూ.50వేలు, మెట్ట రైతులకు ఎకరానికి రూ.30వేల చొప్పున చెల్లిస్తున్నారు. మొదటి ఏడాది కౌలు మాత్రం చెల్లించారు. రెండో ఏడాదికి సంబంధించి కొందరికి ఇంకా చెక్కులు అందలేదు. ఇదిలా ఉంటే 31,634 మంది రైతు కూలీలకు ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి నెల చెల్లించాక.. రెండోనెల నుంచి రకరకాల నిబంధనలతో కూలీల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం 10వేల మంది కూలీలకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు.
పూర్తిగా కౌలు ఎగ్గొట్టాలనే ...
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు పరిహారాన్ని కుదించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు వ్యవసాయ భూమిగా ఉన్న ఆ ప్రాంతాన్ని వాణిజ్య, నివాస ప్రాంతాలుగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి ఇది అనివార్యమైనప్పటికి దీన్నే సాకుగా చూపించి పరిహారం నిలిపివేతకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల పాటు పరిహారం ఇస్తామని చెప్పినప్పటికి భూ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) అనంతరం దీన్ని అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగా సీఆర్‌డీఏ అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ భూమిగా ఉన్న నేపథ్యంలో రైతుకు కౌలు చెల్లిస్తున్నారు. భూ మార్పిడి తరువాత వ్యవసాయ భూములు నివాస, వాణిజ్య ప్లాట్లుగా మార్చనున్నారు. సీడ్ క్యాపిటల్ ఏరియాలో లే అవుట్లు వేయాలన్నా... రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నా, వ్యవసాయ భూమి స్థితిని మార్చాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతమంతా వ్యవసాయ భూములుగా ఉన్నవన్నీ పూర్వ స్థితిని కోల్పోతాయి. వ్యవసాయేతర భూములుగా మార్చిన తరువాత కౌలు పరిహారం ఇవ్వవచ్చు.. ఇవ్వకపోవచ్చు అని సీఆర్‌డీఏ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ల్యాండ్ కన్వర్షన్ చేస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో రైతుల్లో చర్చ మొదలైంది. రైతులకు ప్లాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులను వివరణ అడిగితే ‘మీకెవరు చెప్పారు? అంటూ మాట దాటవేశారు.
కూలీల విషయంలోనూ ఇంతే..
ఇక కూలీలకు ఇచ్చే పెన్షన్ల విషయంలోనూ ఇదే తరహాలో వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. తొలి సంవత్సరం అందరికీ ఇచ్చినప్పటికి ఆ తరువాత రకరకాల పేచీలు పెట్టి తొలగించింది. మొత్తంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారాన్ని భవిష్యత్‌లో చెల్లించే పనిలేకుండా ఉండేందుకు పాలకులు, అధికారులు పావులు కదుపుతుండడం గమనార్హం.
Advertisement
Advertisement