చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా
► ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అక్రమార్కులు
► 2600 ఎకరాల భూ ఆక్రమణ
► అధికారపార్టీ నేతలు బినామీలుగా వ్యవహరిస్తున్న వైనం
ప్రభుత్వ జాగా కనపడితే చాలు పాగా వేస్తున్నారు. ఏకంగా సాగుచేస్తున్నారు. తమకు అనుకూలంగా రెవెన్యూ రికార్డులను మార్చుకుంటున్నారు. దేవాదాయశాఖ భూములకు సంబంధించి అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారు. అధికారపార్టీ నేతల అండదండలతో ఈ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది.
బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు): కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో ఆలయ భూములను అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. ఏకంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయిస్తున్నారు. వాటిని తమ భూములుగా మార్చుకుని రిజిస్ట్రేషన్ సైతంచేయిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని బంధువుల పేరిట బినామీలుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి నెలకొంది.
మండలాల వారిగా భూ ఆక్రమణ
విడవలూరు మండలంలోని వరిణి రెవెన్యూ పరిధిలో 1600 ఎకరాల తీరప్రాంత భూములను అధికారపార్టీ నేతలు ఆక్రమించారు. అదేవిధంగా రామచంద్రాపురం ప్రాంతంలో సైతం 400 ఎకరాలు ఆక్రమించారు. అధికారపీర్టీ నేతలకు బినామీలకు స్థానికులుగా కొందరి పేర్లను చేర్చారు. అదేవిధంగా కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాళెంలో కోవూరు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు కొందరు ఏకంగా వంద ఎకరాలకు పైగా స్వాహా చేశారు.
పోలంరెడ్డి తన అత్త, తండ్రులను బినా మీలుగా చేసుకుని భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవి కాకుండా బొడ్డువారిపాళెం పరీవాహక ప్రాంతంలోనే చుక్కల పేరిట ఉన్న ప్రభుత్వ భూములను తహసీల్దార్ సహకారంతో పట్టా భూములుగా మార్చి స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ భూములకు కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉండడంతో నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.
ఇక ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం, గంగపట్నం, కొరుటూరు, కుడితిపాళెం ప్రాంతాల్లో 150 ఎకరాలకు పైగా తీర ప్రాంత భూములను అధికారపార్టీ నేతలు కబ్జా చేశారు. సముద్రానికి అతి సమీపంలో ఉన్న భూములను టీడీపీ నేతలు చదును చేయించి రొయ్యలగుంతలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కనిగిరి రిజర్వాయర్ బండ్ పరిధిలో 250 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది. బ్రహ్మానందేశ్వర స్వామి భూములతో కామాక్షితాయి ఆలయ భూములు, రెవెన్యూ భూములు కలిపి మరో వంద ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి.
మామూళ్ల మత్తులో రెవెన్యూ, దేవాదాయశాఖాధికారులు
రెవెన్యూ, దేవాదాయ శాఖ పరిధిలోని ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే స్థల పరిశీలన జరుపుతున్నారు. అనంతరం అక్రమార్కుల నుంచి తాయిలాలను తీసుకుని మౌనం వహిస్తున్నారు. ఎవరైనా కోర్టుకు వెళితే, లాయరు సలహాతో కోర్టుకు హాజరవుతున్నారు. ఆక్రమణ జరుగుతున్న సమయంలో స్పందిస్తే ప్రభుత్వ భూముల పరిరక్షణ జరిగేది. కాని అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి న అవసరం ఎంతైనా ఉంది.
దేవాదాయ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
దేవాదాయ భూముల ఆక్రమణపై విచారణ జరుపుతాం. ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. భూమిని స్వాధీనం చేసుకుంటాం. -వేగూరు రవీంద్రరెడ్డి, ఏసీ
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
ప్రభుత్వ భూములు ఆక్రమించడం నేరం. ఆక్రమణలపై విచారణ జరిపిస్తాం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. -వెంకటేశ్వర్లు, ఆర్డీఓ