ఒంగోలు అర్బన్: విజయవాడలోని భవానీ ద్వీపం వద్ద కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్‌పై మంగళవారం కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బోటు ప్రమాదం జరిగిన నవంబర్ 12వ తేదీని ఒంగోలు చరిత్రలో బ్లాక్‌డేగా అభివర్ణించారు. బోటు ప్రమాదం విషయం తెలియగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఒక్కో ఇంటిలో ఇద్దరు మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.
రంగారాయుడు చెరువుకట్టపై మృతుల స్మృతి స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్న వాకర్స్ క్లబ్ సభ్యుల ఆలోచనతో వాకర్స్‌లో ఎంతటి అన్యోన్యత ఉందో అర్థమవుతోందన్నారు. స్థూపానికి వాకర్స్ క్లబ్ ఎంత విరాళం సేకరిస్తుందో అంత మొత్తాన్నీ ఇస్తానన్నారు. అంతేగాకుండా అనుమతుల విషయంలో పూర్తి సహకారం అందిస్తానన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునే విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఎంపీ వైవీ వెంట మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొని మృతులకు నివాళులర్పించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజూ కలిసి అడుగులు కలిపే మిత్రులు ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.
అందుకే వారి జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించాలని తలచామన్నారు. ఈ విషయం ప్రకటించగానే వాకర్స్ నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికే 80 వేల రూపాయల విరాళాలు అందాయన్నారు. ఎంపీ వైవీ వాకర్స్ కుటుంబానికి అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు దేసు కాశి, మాంటిస్సోరీ ప్రకాష్, రాఘవ, టి.రంగారావు, కొటారి రామచంద్రరావు, వేమూరి బుజ్జి, వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, చుండూరి రవి, అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, వై.వెంకటేశ్వర్లు, గొర్రెపాటి శ్రీను, గంగాడ సుజాత, అరుణ, గంటా రామానాయుడు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment