సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒడిశాకు చెందిన వలస కూలీలు, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన (ఇక్కడి వారు అక్కడ.. అక్కడి వారు ఇక్కడ) వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే విషయమై శనివారం వారి మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఒడిశా వలస కూలీలను బాగా చూసుకుంటుండటంపై వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
సమర్థవంతంగా పని చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నాం. కోవిడ్ వల్ల ఎదురైన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది.
– నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్న వారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడే ఉంటామన్న వారి కోసం వారు పని చేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్లేందుకు సిద్ధమైతే కూడా వారిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం. మీలాంటి నాయకులు స్ఫూర్తిదాయకులు.
– వైఎస్ జగన్, ఏపీ సీఎం
గట్టి చర్యలు తీసుకుంటున్నారు
విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారు. ఇందుకు ధన్యవాదాలు. కోవిడ్19ను ఎదుర్కోవడానికి బాగా పని చేస్తున్నారు. వైరస్ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
– ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment