ఒంగోలు టౌన్ : జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల ఖాళీల భర్తీపై ఆ శాఖాధికారులు దృష్టిసారించారు. ప్రాజెక్టుల వారీగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఖాళీలున్నాయి, ఆయాలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి..? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి సంబంధిత శాసనసభ్యులను సంప్రదించి ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆ మేరకు మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి శుక్రవారం స్థానిక తన కార్యాలయంలో జిల్లాలోని 21ప్రాజెక్టులకు చెందిన సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ గుర్తించిన ఖాళీల వివరాలను సేకరించారు. జిల్లాలో ప్రస్తుతం 4,244 అంగన్‌వాడీ కేంద్రాలు, 235 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొన్నిచోట్ల కార్యకర్తలు, మరికొన్నిచోట్ల ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఆయాగా పనిచేస్తూ కార్యకర్తగా పదోన్నతి పొందేవారి వివరాలు కూడా అందులో ఉన్నాయి. దీంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలు కవర్ కాని ప్రాంతాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఎంతమంది జనాభా ఉన్నారు, కవర్ కాని ప్రాంతాల్లో ఎంతమంది జనాభా ఉన్నారన్న లెక్కలు సేకరిస్తున్నారు.
అధికార పార్టీ నేతల ఒత్తిడి...
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అంగన్‌వాడీ పోస్టుల ఖాళీలపై ఆ శాఖాధికారులు హడావిడిగా వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని నెలల నుంచి అనేక కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండు కేటగిరీలకు చెందిన ఖాళీ పోస్టులను భర్తీ చేసే కమిటీకి సంబంధిత శాసనసభ్యుడు చైర్మన్‌గా వ్యవహరించనున్న నేపథ్యంలో ఆయన నిర్ణయమే కీలకం కానుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జిల్లాలో తెలుగుదేశం శాసనసభ్యుల సంఖ్య ఒకటికే పరిమితమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ శాసనసభ్యుల సంఖ్య జిల్లాలో ఐదుకి పెరిగింది. చీరాల నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలున్నచోట అంగన్‌వాడీ పోస్టులపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది.
ప్రస్తుతం ఉన్న ఖాళీలు, జనాభా పెరుగుదలతో కొత్తగా రానున్న కేంద్రాల్లో కూడా తాము సూచించిన వారికే పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ ఇప్పటికే అధికార పార్టీ శాసనసభ్యులపై ఆ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల వివరాలను ప్రాజెక్టుల వారీగా సేకరించాలని ఆదేశాలు రావడంతో హడావిడిగా అధికారులు వాటిని సేకరిస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించిన అనంతరం నోటిఫికేషన్ జారీ చేసి ఆ తరువాత ఇంటర్వ్యూలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఇంటర్వ్యూల్లో సంబంధిత శాసనసభ్యులదే తుది నిర్ణయం కావడంతో తెలుగు తమ్ముళ్లు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి కసరత్తు
Published Sat, Aug 23 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement