అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు | Anganwadi Jobs Notification In Fraud Jagtial | Sakshi
Sakshi News home page

అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు

Published Mon, Apr 30 2018 8:49 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

Anganwadi Jobs Notification In Fraud Jagtial - Sakshi

దళారీ : హలో.. హలో సార్‌.. నమస్తే..!

మహిళా శిశుసంక్షేమాధికారి నరేందర్‌ : నమస్తే.. ఎవరు? 
దళారీ : సార్‌ నేను....మాట్లాడుతున్న.
నరేందర్‌ : హా.. చెప్పండి.
దళారీ : నాకు అంగన్‌వాడీ పోస్టు కావాలి. మీరెంత అంటే అంత. మూడు ఇస్తా... ఐదు అయినా పర్వాలేదు..(రూ.లక్షల్లో)! ఎలాగైనా చూడండి.
నరేందర్‌ : అసలు నువ్వెవరు? ఎవరితో మాట్లాడుతున్నవో తెలుసా..? ఇలాంటి పిచ్చి తమాషాలు చేస్తే జైలుకు పోతవ్‌.
దళారీ : సార్‌.. స్వారీ..!

ఈ సంభాషణ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు అంగట్లో అమ్మకానికి ఉన్నాయనే ఆరోపణలకు బలం చేకూరుస్తోం ది. ఎంతకు అమ్ముడుపోతున్నాయో కూడా ఈ సంభాషణలో పేర్కొనడం గమనార్హం. 

పారదర్శకంగా పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దళారులు మాత్రం అభ్యర్థులకు వల వేయడం మానడం లేదు. రిజర్వేషన్లు.. స్థానికత.. విద్యార్హతను బట్టి పోస్టుల భర్తీ ఉంటుందని పదేపదే స్పష్టం చేసినా... దళారులు మాత్రం, ఎలాగైనా పోస్టులిప్పిస్తామని అభ్యర్థులను నమ్మిస్తున్నారు. టీచర్‌కు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, ఆయా పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందిని నమ్మించి.. లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా జగిత్యాల ఆర్డీవో, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి నరేందర్‌కే ఫోన్‌ చేసి బేరమాడే ప్రయత్నం చేశారంటే.. దళారులు ఏ మేరకు బరి తెగించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సాక్షి, జగిత్యాల : జిల్లాలో 29 అంగన్‌వాడీ టీచర్లు.. 97 ఆయాల పోస్టుల భర్తీకి ఈ నెల 12న నోటిఫికేషన్‌ వెలువడింది. 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా నేటితో ముగియనుంది. రెండు వారాల్లో పోస్టులు భర్తీకానున్నాయి.  పోస్టుల భర్తీకి సమయం దగ్గరపడుతుండడంతో దళారులు తమ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటు అభ్యర్థులకు గాలం వేయడంతో పాటు అధికారులనూ మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో పోస్టులిప్పిస్తామనీ హామీ ఇచ్చారు. తాజాగా.. జగిత్యాల మండల పరిధిలోని ఓ గ్రామంలో తన భార్యకు పోస్టు కోసం పార్టీ మారేందుకూ ఓ వ్యక్తి సిద్ధమైనట్లు సమాచారం.


జిల్లాలో ధర్మపురి, జగిత్యాల, మల్యాల, మెట్‌పల్లిలో ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1037 మెయిన్‌ అంగన్‌వాడీ, 28 మినీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 7,588 మంది గర్భిణులు, 6,658 మంది బాలింతలు ఉన్నారు. ఆరు నెలల నుంచి ఏడాది వయసు పిల్లలు 7,693 మంది, ఏడాది నుంచి 3 ఏళ్ల వయసు పిల్లలు 25,924, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలు 15,709 మంది, మొత్తం 63,572 మంది చిన్నారులు ఆయా కేంద్రాల ద్వారా లబ్ధిపొందుతున్నారు.

వీటి పరిధిలో 29 మేజర్‌.. రెండు మినీ అంగన్వాడీ టీచర్లు, 97 ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో.. సమీప కేంద్రాల నిర్వాహకులకు నిర్వహణ బాద్యతలు అప్పగించారు. అయితే ఇన్‌చార్జీలతో చాలాచోట్ల వాటి నిర్వహణ గాడి తప్పింది. దీంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల హాజరుశాతం తగ్గింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులు భావించారు. ఈ మేరకు ప్రాంతాల వారీగా పోస్టుల్లో రిజర్వేషన్లు కేటాయించారు. వాటి భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరించారు. పదో తరగతి ఉత్తీర్ణత, 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు, వివాహితురాలై ఆ ఊరి కోడలై ఉండడం, వికలాంగులకూ పలు నిబంధనలు సడలిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సైతం ఆన్‌లైన్‌లోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు.

రంగంలోకి దళారులు..
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అంగన్‌వాడీ టీచర్‌ లేదా ఆయా పోస్టు ఇప్పిస్తామంటూ దళారులు రంగప్రవేశం చేశారు. రిజర్వేషన్లపై అవగాహన లేని అభ్యర్థులతో బేలారు మొదలుపెట్టారు. టీచర్‌ పోస్టు ఇప్పిస్తామని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయా పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే పోస్టులు వరించేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసి.. అర్హులైన వారికే పోస్టులు ఇచ్చేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగానే కలెక్టర్‌ శరత్, జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖ అధికారి నిబంధనల మేరకు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా.. త్వరలోనే జరగనున్న పోస్టుల భర్తీలో అధికారులు పాటిస్తున్న పారదర్శకత చివరి వరకూ అలాగే కొనసాగుతుందో, లేదో చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement