రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఆగస్టు 31న 60 సంవత్సరాలు దాటిన 658 మంది వర్కర్లు, 2540 మంది హెల్పర్లు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ శారద తెలిపారు.
కర్నూలు (అర్బన్) : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఆగస్టు 31న 60 సంవత్సరాలు దాటిన 658 మంది వర్కర్లు, 2540 మంది హెల్పర్లు పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ శారద తెలిపారు. సోమవారం ఆమె 'సాక్షి'తో మాట్లాడుతూ.. ఖాళీ కానున్న కేంద్రాలకు సమీపంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. పదవీ విరమణ పొందుతున్న వర్కర్లకు రూ.50 వేలు, హెల్పర్లకు రూ.20 వేలను ఆన్‌లైన్‌లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ కూడా విడుదలైందన్నారు.
నాలుగు జిల్లాల్లో ఖాళీగా ఉన్న వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగుతోందన్నారు. కర్నూలులో 89 వర్కర్లు, 273 హెల్పర్లు, 9 మినీ అంగన్‌వాడీ వర్కర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించామని, కడపలో 148 వర్కర్లు, 299 హెల్పర్లు, 78 మినీ అంగన్‌వాడీ వర్కర్లు.. చిత్తూరులో 114 వర్కర్లు, 220 హెల్పర్లు, 212 మినీలకు, అనంతపురంలో 108 వర్కర్లు, 185 హెల్పర్లు, 81 మినీలకు దరఖాస్తులు అందాయన్నారు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా అభ్యర్థుల ఎంపిక చేపడతారన్నారు.