సాక్షి, నంద్యాల : నంద్యాల పట్టణ శివారులోని కర్నూలు–కడప జాతీయ రహదారి పక్కనున్న రవాణా శాఖ (ఆర్టీఓ) కార్యాలయంలో పైసలివ్వందే ఏ పనీ జరగడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకుని ప్రతి పనికీ ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ఇక్కడి అధికారులు అనధికారికంగా ఏజెంట్లను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారు. వారి ఆగడాలు శ్రుతిమించడంతో వ్యవహారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాకా వెళ్లింది. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి..క్లర్క్‌తో పాటు నలుగురు అనధికారిక ఏజెంట్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.39 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన క్లర్క్ దత్తాత్రేయ
నంద్యాల పట్టణానికి చెందిన కరీం అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అనధికారిక ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా దరఖాస్తు చేసుకున్నాడు. అతను అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కాలేదు. చివరకు కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న దత్తాత్రేయను కలిశాడు. డబ్బు ఇస్తేనే పని అవుతుందని ఆయన కరాఖండీగా చెప్పాడు. రూ.2,500 ఇవ్వడానికి అతను అంగీకరించగా.. అది చాలదని, అదనంగా ఇవ్వాలని క్లర్క్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు.
ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలోకి బాధితుడిని పంపారు. అతను క్లర్క్ దత్తాత్రేయను కలిసి రూ.2,500 ఇచ్చాడు. మిగతా డబ్బు ఏదని క్లర్క్ అడగ్గా.. బయటకు వెళ్లి తీసుకొని వస్తానని చెప్పాడు. ఇంతలోనే ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చి క్లర్క్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోకి ఎవరినీ రానివ్వకుండా, లోపలున్న వారిని బయటకు పంపించకుండా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయ అధికారులు అనధికారికంగా నియమించుకున్న ఏజెంట్లు నరసింహ, సోమేశ్వరరెడ్డి, రమేష్, బాషాలను అదుపులోకి తీసుకుని విచారించారు.
వీరి వద్ద రూ.39,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో బాషా అనే ఏజెంట్ ఏసీబీ అధికారుల కన్నుగప్పి బయటకు పారిపోయాడు. క్లర్క్‌తో పాటు మిగతా ముగ్గురిని తమ అదుపులో ఉంచుకున్నారు. సోమేశ్వరరెడ్డి అనే ఏజెంట్ స్వయాన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వాహన డ్రైవర్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment