నత్తే నయం! | Officials Neggligance on Canal Works in PSR Nellore | Sakshi
Sakshi News home page

నత్తే నయం!

Published Mon, Nov 4 2019 1:18 PM | Last Updated on Mon, Nov 4 2019 1:18 PM

Officials Neggligance on Canal Works in PSR Nellore - Sakshi

నిర్మాణ దశలో ఉన్న కనుపూరు కెనాల్‌ పనులు

వ్యవసాయ రంగంలో కీలకమైన జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పనుల్లో కొందరు కాంట్రాక్టర్ల అలసత్వం రైతాంగానికి శాపంలా మారింది.  ప్రభుత్వాలు రూ.కోట్లు మంజూరు చేసినా ఆయా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయలేక చేతులెత్తేస్తున్నారు. టెండర్లలో దక్కించుకున్న పనులను పర్సంటేజీ కోసం సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. కాంట్రాక్టర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం వెరసి పనులు పూర్తికాక పంటలకు నీరు సక్రమంగా అందడం లేదు. దీంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు.  ఇందుకు తార్కాణం ప్యాకేజీ–4లో జరుగుతున్న కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ పనులే. లైనింగ్‌  పనులు ప్రారంభించి దశాబ్దం ముగిసినా కూడా సగభాగం కూడా పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని 66 వేల ఎకరాలకు సాగునీరందించే కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ వర్క్స్‌ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో ప్యాకేజీ–4 కింద రూ.71.94 కోట్లు మంజూరు చేశారు. ఆయా పనులను ఏకేఆర్‌ కోస్టల్‌ కంపెనీ పేరుతో  టెండర్‌ ద్వారా చేజిక్కించుకుని 2008 మార్చి మూడోతేదీన అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రెండేళ్లలో ఆయా పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్‌లో చూపించారు. ఆ నిధులతో జిల్లాలోని సంగం నుంచి బండేపల్లి వరకు సుమారు 55 కిలో మీటర్లు కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ వర్క్స్, 44 స్ట్రెక్చర్స్‌ రిపేర్లు చేయాల్సి ఉంది. ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పర్శింటేజీలు తీసుకుని సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించారు. 55 కిలోమీటర్ల  వరకు కెనాల్‌ లైనింగ్‌ పనులను భాగాలుగా విభజించి సబ్‌ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. కానీ పదకొండేళ్లు పూర్తయినా కూడా లైనింగ్‌ పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. ఇప్పటివరకు 51.94 శాతం పనులే పూర్తి చేశారు. మిగిలిన 48.6 శాతం పనులు పూర్తికాలేదు. టెండర్‌ అగ్రిమెంట్‌లో మాత్రం రెండేళ్లకాల వ్యవధిలో పూర్తిచేస్తానని చూపించినా దశాబ్దకాలం దాటినా కూడా పనులు పూర్తి చేయకపోవడం వెనుక కాంట్రాక్టర్‌ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. గత టీడీపీ  ప్రభుత్వంలో మాత్రం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామంటూ కల్లిబొల్లి మాటలతో నెట్టుకొచ్చారే తప్పా ప్యాకేజీ –4 పనులపై గత పాలకులు దృష్టిసారించలేకపోయారు. కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీలు తీసుకుంటూ పనులు చేయని వారికి వత్తాసు పలుకడంతో ప్యాకే జీ–4 పనుల్లో అడుగుమందుకు పడలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. 

గతేడాది నుంచి నిలిపివేసిన పనులు
గత టీడీపీ హయాంలో ఆ పార్టీకీలక నేతలతో సత్సబంధాలు నెరిపిన కాంట్రాక్టర్‌ ప్యాకేజీ–4 పనులు నత్తనడకన సాగిస్తున్న కాంట్రాక్టర్‌పై  చర్యలు తీసుకున్న దాఖాలాలు కన్పించలేదు. గతేడాది నుంచి కెనాల్‌ లైనింగ్‌ పనులు పూర్తి స్థాయిలో నిలపివేశారు. పూర్తయిన పనులకు దాదాపు రూ.4 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సాకు చూపి సదరు కాంట్రాక్టర్‌ పూర్తిస్థాయిలో పనులు నిలిపివేసినట్లు అధికారులు చెపుతున్నారు. ప్రతిఏటా ఆ వర్క్స్‌ అగ్రిమెంట్‌ పెంచుకుపోతున్నా కూడా కాంట్రాక్టర్‌ సహకరించడం లేదని అధికారులు తెలిపారు. పనులు పూర్తిచేయాలని రెండు సార్లు నోటీసులు జారీ చేసినా కాంట్రాక్టర్‌ నుంచి స్పందన లేదని తెలుస్తోంది.

సాగునీరు అందక..
జిల్లాలో దాదాపు 66 వేల ఎకరాలకు సాగునీరు అందించే కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ పనులు నిలిచిపోవడంతో ఆ ఆయకట్టు రైతులకు సాగునీరు సక్రమంగా అందడంలేదని ఆ ప్రాంత రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌ లైనింగ్, స్టేక్చర్స్‌ రిపేర్లు జరిగి ఉంటే సాగునీరు సకాలంలో అందే అవకాశం ఉంది. ఆయా పనులు జరగకపోవడంతో కెనాల్‌లో సాగునీరు సక్రమంగా పారుదల లేక చివరి ఆయకట్టు వరకు అందక ఎండిపోతుందని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు.

కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చాం
కనుపూరు కెనాల్‌ లైనింగ్‌ పనులు చేసే కాంట్రాక్టర్‌కు ఇప్పటికే రెండు సార్లు నోటీసులిచ్చాం. పనులు నత్తనడకన సాగుతున్న విషయం వాస్తమమే. ఆ కాంట్రాక్టర్‌కు నోటీçసులు ఇచ్చినా స్పందన లేదు. గతేడాది నుంచి ఆ పనులను పూర్తిగా నిలిపివేశారు. ఆ పనులు నిలిచిపోవడంతో సాగునీరు సరఫరాకు ఇబ్బందిగా ఉంది.– కృష్ణమెహన్, నెల్లూరు సెంట్రల్‌ఇరిగేషన్‌ ఈఈ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement