సాక్షి ప్రతినిధి, కడప: పసిపిల్లల పౌష్టికాహారాన్ని అడ్డంగా బొక్కేశారు. పిల్లల నోటికాడి తిండి లాగేసుకున్న అధికారులకు ఆ పాపం వెంటాడుతోంది. ఉన్నతాధికారుల విచారణలో వాస్తవాలు వెలుగు చూడటంతో చిక్కులు తప్పడం లేదు. దీంతో ప్రొద్దుటూరు ఐసీడీఎస్ రూరల్ సీడీపీఓకు ఉచ్చు బిగుసుకుంది. క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారాన్ని సమైక్య ఉద్యమం ముసుగులో నొక్కేందుకు యత్నించారు. రవాణాదారులనుంచి ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ వరకు వారి వారి స్థాయిలో దండుకున్నారు. పౌష్టికాహారాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించాల్సిందిగా సీడీపీఓ ఆదేశాలు జారీ చేశారు. అ మేరకు అంగన్‌వాడీలు రికార్డులు తయారుచేశారు.
ఈవైనాన్ని ముందుగా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో సూపర్‌వైజర్ సుశీలను సస్పెండ్ చేశారు. అనంతరం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈనేపధ్యంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి విచారణ చేపట్టారు. ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ మేరీఎలిజెబెత్‌కుమారి పరిధిలో రూ.10.7లక్షలు విలువ చేసే 1050 బస్తాల పౌష్టికాహారం పక్కదారి పట్టినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఉద్యమం ముసుగులో....
సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం జిల్లాలో ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ పరిణామాన్ని అనువుగా మలుచుకుని ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు చెందిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించారు. ట్రాన్సుపోర్టు నిర్వాహకుడు, ఇరువురు సూపర్‌వైజర్లు, ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ ఇందులో కీలకపాత్ర వహించారు.
పౌష్టికాహారంపై ప్రశ్నించిన అంగన్‌వాడీ వర్కర్లకు సరఫరా చేసినట్లు రికార్డులు రూపొందించాలని రూరల్ సీడీపీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అంగన్‌వాడీ వర్కర్లు రికార్డులు తయారుచేశారు. ఈవిషయాన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. విచారణకు ఆదేశాలు రావడంతో ఎంటీఎఫ్ పౌష్టికాహారం స్థానంలో తవుడు కలిపిన పిండి సరఫరా చేసినట్లు రూఢీ అయింది. ప్రొద్దుటూరు రూరల్ సీడీపీఓ పరిధిలో 1050 బస్తాల పౌష్టికాహారాన్ని బొక్కేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీని విలువ రూ.10.70లక్షలుగా ఉన్నతాధికారులు అంచనా వేశారు.