
రైతులతో మాట్లాడుతున్న జాతీయ కొబ్బరిబోర్డు సభ్యుడు చౌడప్ప
శ్రీకాకుళం, కవిటి: తిత్లీ తుఫాన్ కారణంగా కవిటి పరిసర ప్రాంత ఏడు మండలాల పరిధిలో అపార నష్టం వాటిల్లిందని, వీటి నివేదికను కేరళలోని కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు అధ్యక్షునికి అందిస్తానని జాతీయ కొబ్బరి బోర్డు సభ్యుడు, సెంట్రల్ ప్లాంటేషన్ రీసెర్చ్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చౌడప్ప వెల్లడించారు. తిత్లీ తుఫాన్ ప్రభావిత ఏడు మండలాల్లో కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు సభ్యుల బృందం బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా కవిటి చిక్కాఫ్ కార్యాలయంలో బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ బీభత్సానికి కొబ్బరి పంట సర్వనాశనమైందని తెలిపారు. ఈ విషయమై త్వరలో భువనేశ్వర్‌లో నిర్వహించనున్న జాతీయ కొబ్బరి బోర్డు పాలకమండలి సమావేశంలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. కేశర్‌గూడ ఐకార్ పరిశోధనా స్థానం సౌజన్యంతో ఉద్దానం ప్రాంతంలో కొత్త మొక్కల పంపిణీ, కొబ్బరితోటల పెంపకానికి డిమానిస్ట్రేషన్‌తో కూడిన విధానంలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇక్కడ రైతులు ఈస్ట్‌కోస్ట్ టాల్ వెరైటీ మొక్కలు సాగు చేస్తున్నారని, దీనికి ప్రత్నామ్నాయంగా సంకరజాతి పొట్టి రకాల మొక్కలు, వెస్ట్‌కోస్ట్ టాల్ వెరైటీ మొక్కల పెంపకంతో కూడా మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు. ఆ రకాల పెంపకానికి ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి, కొత్త తోటల అభివృద్ధికి సీడీబీ తరపున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లపాటు ఎటువంటి ఫలసాయం లేక ఆదాయం రాక ఆర్థికంగా అస్తవ్యస్తమైన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఔషధ మొక్కల పెంపకం, కోకో, దాల్చిన చెక్క, అల్లోవెరా, తదితర పంటల సాగు చేసేందుకు అవకాశాలపై మరోమారు ఈ ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు. ప్రధానంగా కొత్త తోటల అభివృద్ధికి సాధ్యమైనంత వరకు జాతీయ కొబ్బరి బోర్డు నుంచి శతశాతం సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పర్యటనలో డాక్టర్ సుబ్రమణ్యన్, డాక్టర్ వీ నిరాల్, డాక్టర్ జోసెఫ్‌రాజ్‌కుమార్, డాక్టర్ కేపీ చంద్రన్, హార్టీకల్చర్ ఏడీహెచ్ కే చిట్టిబాబు, ఉద్యానశాఖ అధికారి సీహెచ్ శంకర్‌దాస్, చిక్కాఫ్ రైతు సంఘం నేతలు ఆరంగి శివాజీ, బల్లెడ కృష్ణారావు, బొర్ర వెంకటరమణ, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment