సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయంపైకి ఒగ్గు కళాకారులు దండెత్తారు. దీంతో సోమవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒగ్గు కథ కళాకారులకు అక్టోబర్ 7, 8 తేదీల్లో వర్క్‌షాపును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారు రవీంద్రభారతికి వచ్చేందుకు రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే 5వ తేదీన వర్క్‌షాపు రద్దు చేస్తున్నట్లు సమాచారం అందించారు.
అప్పటికే రవాణాకి కొంత మొత్తం వెచ్చించిన 132 మంది కళాకారులు సోమవారం ఉదయం 11.30కి రవీంద్రభారతికి చేరుకున్నారు. ఒగ్గు కథ, గొరవయ్యలు, తప్పెటగుళ్ళు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సత్యనారాయణ, నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు కార్యాలయం ఎదుట బ్యాండ్, డోల్, నపీరాలు వాయిస్తూ ధర్నాకు దిగి గంటపాటు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఆర్.కవితాప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ చివరిలో ఒగ్గు కళాకారుల వర్క్‌షాపు నిర్వహించనున్నామన్నారు.