
ఆయిల్ మాఫియా
మేదరమెట్ల: జాతీయ రహదారిపై ఆయిల్ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అన్ని స్థాయిల్లో అధికారుల అండ చూసుకొని కిరోసిన్, ఇతర ఆయిల్స్ అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మొదట్లో మారుమూల ప్రాంతంలో ఎవరూ చూడని ప్రదేశంలో కేవలం కిరోసిన్ మాత్రమే సేకరించి లారీలకు విక్రయించే వారు. ప్రస్తుతం జాతీయ రహదారి పక్కనే యథేచ్ఛగా డిజిల్, సోప్ ఆయిల్, గేర్ ఆయిల్, పామాయిల్, తారు, ఇనుము లారీల నుంచి అక్రమంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు.
మద్దిపాడు మండలంలోని మద్దిపాడు నుంచి కొరిశపాడు మండలం గుండ్లాపల్లి, మేదరమెట్ల, కొరిశపాడు, అద్దంకి మండలంలోని వెంకటాపురం, పంగులూరు మండలంలోని రేణంగివరం, కొండమంజులూరు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా అక్రమార్కులు సుమారు 20 కిపైగా అక్రమ ఆయిల్‌బంకులను ఏర్పాటు చేసి రాత్రీ పగలు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీటిల్లో కిరోసిన్ అమ్మే బంకులు పది, డిజిల్‌తోపాటు ఇతర ఆయిల్స్ అమ్మే బంకులు పదికిపైగా ఉన్నాయి. ఇవి కాకుండామేదరమెట్ల-నార్కెట్‌పల్లి రోడ్డులో బొడ్డువానిపాలెం నుంచి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు సుమారు మరో పది బంకులకుపైనే ఈ వ్యాపారం సాగిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఒంగోలు, కనిగిరి, ఇంకొల్లు, వినుకొండ, నరసరావుపేట హాకర్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసే కిరోసిన్ ట్యాంకర్లు నేరుగా హైవేపై ఉన్న బంకులకు చేరుతుంది. వాస్తవంగా రేషన్ దుకాణాలకు ప్రతినెలా 25వ తేదీ నుంచి 1వ తేదీలోపు రేషన్ చేరాలి. కానీ అక్రమార్కులు ఈ తేదీలను మినహాయించి మిగిలిన రోజుల్లో రోజు మార్చి రోజు వచ్చే ట్యాంకర్ల నుంచి బంకుల వద్ద నీలికిరోసిన్‌ను బయటకు తీస్తుంటారు. అలా వచ్చిన ఒక్కో ట్యాంకర్‌లో 12 వేల లీటర్ల కిరోసిన్ ఉంటుంది.
లారీ డ్రైవర్ల కక్కుర్తి...
హైవేపై తిరిగే లారీల్లో కొందరు డ్రైవర్లు మామూలు డీజిల్ బంకుల్లో తమ వాహనాలకు ఆయిల్‌ను కొట్టించకుండా అక్రమార్కుల వద్ద కిరోసిన్ పోయిస్తారు. వీరు లారీలో లీటర్ కిరోసిన్ రూ.46 లెక్క పోయించుకుని తమ వాహన యజమానికి మామూలు డీజిల్ ధర ప్రకారం లెక్క చూపిస్తారు. అందుకుగాను ఒక్కో డ్రైవర్‌కు లీటర్‌కు సుమారు రూ.10 మిగులుతాయి. వీరి కక్కుర్తి అక్రమార్కులకు వరమైంది.
కిరోసిన్‌తో నడిచే వాహనాలు త్వరగా బోరుకు వ స్తాయి..
కల్తీలేని డీజిల్‌తో నడిచే వాహనం జాగ్రత్తగా తిరిగితే రెండు, మూడేళ్ల వరకు బోరుకు రాదు. అదే కిరోసిన్ వాడకం వల్ల ఏడాదికే బోరుకు వచ్చి లారీ మూలనపడుతుంది. దీనివల్ల లారీ యజమానికి నష్టం వాటిల్లుతోంది. అంతేగాక ఈ లారీలు ఎక్కువ మోతాదులో పొగను విడుదల చేయడం వల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.
రేషన్ డీలర్ల కుమ్మక్కు ఇలా...
హైవేపై ఉన్న అక్రమార్కుల బంకులకు నీలికిరోసిన్ అమ్మడమే ధ్యేయంగా కొందరు డీలర్లు పనిచేస్తున్నారు. కొంతమంది డీలర్లైతే తమ వద్దకు కిరోసిన్ రానివ్వకుండానే ట్యాంకర్లను నేరుగా దళారుల ద్వారా బంకుల వద్దకు అర్ధరాత్రి తరలిస్తుంటారు. ఇందుకుగాను ఒక్కో డీలర్‌కు లీటర్‌కు సుమారు రూ.15 నుంచి రూ.25 వరకు మిగులుతాయి. పేదలకు అందాల్సిన కిరోసిన్‌ను దొడ్డి దారిన అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
గేర్, ఇంజిన్ ఆయిల్...
చెన్నైపోర్టు నుంచి హైదరాబాద్, కోల్‌కత్తా, పూణె తదితర ప్రాంతాలకు వెళ్లే గేర్, ఇంజిన్ ఆయిల్ ట్యాంకర్ల నుంచి ట్యాంకర్ డ్రైవర్లు అక్రమార్కుల స్థావరాల వద్ద బయటకు తీస్తారు. ఒక్కో ట్యాంకర్ నుంచి లీటర్ రూ.53 చొప్పున సుమారు 5 పీపాలు(1100 లీటర్లు) పడతారు. అలా సేకరించిన ఆయిల్‌ను సమీపంలోని ఆటోమొబైల్ షాపులకు లీటరు రూ.76కు ఇస్తుంటారు. ఆ ట్యాంకర్లు చేరాల్సిన ప్రాంతాల్లోని వారికి మామూళ్లు ఇస్తుండడంతో లోపల ఎన్ని లీటర్లు ఉందో పట్టించుకోరని ట్యాంకర్ల డ్రైవర్లు చెబుతుంటారు. కొందరు అక్రమార్కులు ఇలాంటి ఆయిల్‌ను లీటరు, అరలీటరు, వందగ్రాములు ఇలాప్యాకింగ్ చేసి మరీ ఆటోమొబైల్ షాపులకు అమ్ముతుంటారు.
పామాయిల్...
కాకినాడ, వైజాగ్ పోర్టుల నుంచి వచ్చే ముడి పామాయిల్ నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాలకు వెళ్లే ట్యాంకర్ల నుంచి ఒక్కోదాని నుంచి సుమారు 660 లీటర్లు తీస్తారు. దీనిని ఒక్కో లీటర్‌ను రూ.42కు కొంటారు. ఈ ఆయిల్‌ను స్థానిక వ్యాపారులకు రూ.56కు అమ్ముతారు. అలా కొన్న ఆయిల్‌ను వీరు మామూలు ఆయిల్‌లో కల్తీ చేసి మార్కెట్ ధరకు ప్రజలకు విక్రయిస్తారు. తారును కూడా ఇలానే సేకరించి హైవేపై ఉన్న తారు ప్లాంట్లకు విక్రయిస్తారు. అలాగే స్థానికంగా ఉన్న చిన్నచిన్న రోడ్డు కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తుంటారు. దీనిని పీపాల లెక్కన కొంటారు. ఒక్కో దాన్ని రూ.6500కు కొని తారు ప్లాంట్లకు రూ.9 వేల లెక్కన విక్రయిస్తారు.
ఇనుము..
పొడవాటి ట్రాలీల ద్వారా రవాణా చేసే ట్రాలీల డ్రైవర్లు ట్రాలీలోని బారు ఇనుప చువ్వల ఒక్కో కట్ట నుంచి ఒకటి, రెండు చువ్వలు బయటకు లాగి అక్రమార్కులకు అమ్ముతారు. అలా సేకరించిన చువ్వలను స్థానిక ఇనుము వ్యాపారులకు అమ్ముతారు.
మామూళ్లు మామూలే..
ఈ అక్రమ వ్యాపారాన్ని వదిలేసినందుకుగాను ఒక్కో కిరోసిన్ బంకు నుంచి నెలకు రూ.4 వేలు చొప్పున అటు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఇస్తున్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇతరులకు కూడా సుమారు రూ.3 వేల చొప్పున ఇస్తుంటారు.
ప్రతి నెలా సుమారు రూ.3 కోట్ల వ్యాపారం...
హైవేపై ఉన్న అక్రమ బంకుల వారందరూ కలిపి నెలకు సుమారు రూ.3 కోట్లకుపైనే వ్యాపారం చేస్తున్నారు. హైవేపై నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు సైతం తిరుగుతున్నా ఎవరూ ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమవ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.
వ్యాపారంలోకి దిగితే చాలు లక్షాధికారే...
ఈ అక్రమ వ్యాపారంలోకి ఒకరిని చూసి మరొకరు ఆకర్షితులవుతున్నారు. ఏమీ పనిలేని వారు ఇలాంటి వ్యాపారంలోకి దిగి అతితక్కువ కాలంలోనే లక్షాధికారులు అవుతుండటం చూసి యువత సైతం ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నా దృష్టికి రాలేదు
పి.వి.సాంబశివరావు, తహశీల్దార్
కిరోసిన్ అక్రమ వ్యాపారం గురించి నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్రమంగా కిరోసిన్ వ్యాపారం చేసేవారిపై చర్యలు తీసుకుంటాం.
నీలి కిరోసిన్‌ను
డీజిల్‌గా మార్పు...
నీలి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చినందు వల్ల ఒక్కో లీటర్‌కు అదనంగా మరో రూ.10 వస్తాయి. ఇలా మార్చినందున ఒక్కో లీటర్‌కు రూపాయి వరకు ఖర్చవుతుంది. నీలి కిరోసిన్ 220 లీటర్ల డ్రమ్ముకు ఒక కేజీ కెమికల్ పౌడర్, వంద గ్రాముల వైట్ యాసిడ్, ఒకలీటర్ గేర్‌ఆయిల్‌ను కలిపితే కిరోసిన్...డీజిల్ రంగులోకి మారుతుంది. దీనిని మార్కెట్‌లో ఉన్న డీజిల్ ధర కంటే రూ.3 తక్కువకు విక్రయిస్తుంటారు. కల్తీ డీజిల్‌ను తాళ్లూరు, గంగవరం వంటి మారుమూల పల్లెల్లోకి రాత్రిపూట తరలిస్తుంటారు. అక్కడ మామూలు బంకుల వాళ్లు ఈ డీజిల్‌ను మార్కెట్‌లో దొరికే ధర కంటే లీటర్‌కు ఒకటి నుంచి మూడు రూపాయలకు అదనంగా అమ్ముతారు.
నీలి కిరోసిన్ రవాణా...
అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 196 రేషన్ దుకాణాల నుంచి అక్రమార్కులు కిరోసిన్ సేకరిస్తారు. ఈ మొత్తం దుకాణాలకు ప్రతినెలా 8,300 లీటర్ల కిరోసిన్ చేరుతుంది. ఇందులో రేషన్‌కార్డుదారులకు చేరేది కేవలం 2,500 లీటర్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని హైవేపై ఉన్న కిరోసిన్ మాఫియాకు తరలిస్తారు. రేషన్‌డీలర్‌కు ఒక్కో లీటరు రూ.15 పడుతుండగా, వీరి వద్ద నుంచి దళారులు ఒక్కో లీటర్‌ను రూ.30ల చొప్పున కొనుగోలు చేస్తారు. ఇలా కొన్న కిరోసిన్‌ను హైవేపై ఉన్న అక్రమార్కులు ఒక్కో లీటర్ రూ.46 చొప్పున లారీలకు అమ్ముతుంటారు.