ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
కరోనాతో బెజవాడ గడగడలాడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 35 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 27 మంది విజయవాడకు చెందిన వారే కావడం గమనార్హం. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు మృత్యు ఒడికి చేరగా, చికిత్సతో ముగ్గురు యువకులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో నమోదైన కరోనా కేసుల వివరాలతో ప్రత్యేక కథనం.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 35 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 27 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిలో 50 ఏళ్ల వయస్సు పైబడిన ఇద్దరు (54, 56 వయస్సు) వ్యక్తులు మృత్యువాత పడగా, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు యువకులు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 30 మంది కరోనా బాధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రి, గన్నవరంలోని పిన్నిమనేని సిద్ధార్థ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరందరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం 50 ఏళ్లు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారిపై ఎక్కువగా ఉంటోందని, వారు రికవరీ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో యువత త్వరగా కోలుకుంటున్నట్లు చెబుతున్నారు.
కరోనా వైరస్ సోకిందిలా..
జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు 14 మంది ఉన్నారు. ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారు 12 మందికి కరోనా పాజిటివ్ రాగా, వైరస్ ఎలా సోకింది అనే అంశం తెలియని మరో ఐదుగురు కూడా ఉన్నారు. ఆ ఐదుగురిలో కొత్తపేటకు చెందిన 43 ఏళ్ల మహిళ, సూర్యారావుపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడు, బారిష్టర్ వీధికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి, కుమ్మరిపాలేనికి చెందిన 24 ఏళ్ల యువకుడు, భవానీపురానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. వారికి ఎలా సోకింది, కాంటాక్ట్ ఎక్కడ అనే దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. వారికి జలుబు, దగ్గు, జ్వరం రావడంతో స్వచ్ఛందంగా ఆస్పత్రులకు వచ్చారు. కుమ్మరిపాలెం సెంటర్‌లో ఒకే డోర్ నంబరు గల ఇంట్లో ఐదుగురికి పాజిటివ్ రావడం, వీరితో పాటు పరిసర ప్రాంతాల్లో ఇద్దరికి పాజిటివ్ రావడం, అదే ప్రాంతంలో ఒకరు మృతి చెందడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, ప్రత్యేక దృష్టి సారించారు.
వాళ్లు రావడమే సీరియస్ కండీషన్‌లో వస్తున్నారు
50 ఏళ్లు పైబడిన వయస్సు వారిలో కరోనా పాజిటివ్ వస్తే ఆస్పత్రికి వచ్చేటప్పటికే సీరియస్ కండీషన్‌లో ఉంటున్నారు. మధుమేహం, రక్తపోటు ఉన్న వారిలో సైతం కరోనా వస్తే తగ్గడానికి సమయం పడుతోంది. మా వద్ద చికిత్స పొందిన ముగ్గురు యువకులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒకరిద్దరు సీరియస్ కండీషన్‌లో ఉన్నారు. వారిని ఐసీయూలో ఉంచాం. అవసరమైతే వెంటిలేటర్ సపోర్టు పెడతాం. వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. –డాక్టర్ ఎన్.గోపీచంద్, నోడల్ ఆఫీసర్, కోవిడ్–19 ట్రీట్‌మెంట్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment