ఏలూరు : ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని అక్రమంగా అధికారులు సొంతం చేసుకున్నారని ఓవృద్ధ దంపతులు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాపురానికి చెందిన లక్ష రమణరావు, సావిత్రమ్మలకు 2009లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయింది. దానికి సంబంధించిన సంతకాలు పెట్టాల్సిఉందని వాళ్లను పిలిపించి ఆ ఇంటికి సంబంధించిన కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారు అప్పటి కార్పొరేటర్ వెంపటి వెంకన్న. ఆ తర్వాత ఇంటిని రూ.1.50 లక్షలకు వేరే వారికి అమ్ముకున్నాడు.
అప్పటి నుంచి తమ ఇంటి స్థలం తమకు ఇప్పించాలని అధికారులు చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రస్తుత కార్పొరేటర్‌ను కలవడంతో ఎలాగైనా న్యాయం చేస్తామని చెప్పారే తప్ప ఇంతవరకూ ఎలాంటి ముందడుగు లేకపోవడంతో దంపతులు మనస్థాపానికి గరైయ్యారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి సోమవారం వచ్చిన దంపతులు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకొని వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.