విలపింఛెన్
కావూరు సుబ్బులు. ఈమె వయసు 88 సంవత్సరాలు. పింఛన్ తొలగించారన్న విషయం తెలియడంతోనే సగం చచ్చిపోయింది. దరఖాస్తు చేసి, సంబంధిత అధికారుల చుట్టూ తిరిగే ఓపిక లేక ఈ నెల 4వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎనిమిది రోజులపాటు మృత్యువుతో పోరాడి 12వ తేదీన మృతి చెందడంతో ఊరూ,వాడా ఒక్కటై సర్కారు తీరును నిరసించింది.
రెండు కాళ్లు లేవు... కాళ్లీడ్చుకుంటూ వచ్చాను. నా పేరు పింఛన్ జాబితా నుంచి తొలగిస్తారా... కనికరించండయ్యా అంటూ కళ్లనీళ్ల పర్యంతమైనా అయ్యోపాపం అనే వాళ్లే లేరాయే. కంభం పట్టణం సంగా వీధికి చెందిన సుబ్బమ్మ (70) ఈ నెల 10వ తేదీన ఎంపీడీఓ వద్ద చేసిన ఆర్తనాదం పింఛన్ల కమిటీని కదిలించలేకపోయింది.
అద్దంకి మండలం గంగపాలేనికి చెందిన చండ్ర వీరయ్య (72) పదిహేను సంవత్సరాలుగా పింఛన్ తీసుకుంటూ వస్తున్నాడు. తాజాగా బయోమెట్రిక్ విధానంతో వేలిముద్ర వేయించుకోవాలి. పోస్టల్ కార్యాలయం చుట్టూ తిరిగినా వేలిముద్ర సరిపోవడం లేదంటూ తిరస్కరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. 13వ తేదీన గుండె ఆగి చనిపోయాడు.
ఓ వైపు జన్మభూమి సభలో అధికారులు, నేతల ప్రసంగాలు. మరో వైపు దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన వృద్ధుల విలాపం. వీరి వినతులను పట్టించుకునే నాథులే కనిపించకపోవడంతో ప్రాంగణంలోనే సొమ్మసిల్లిపోతున్న పండుటాకులు. కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో ఈ నెల 4వ తేదీన జరిగిన సభలో ఎస్. నాగమ్మ (90) అనే వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయినా పట్టించుకోలేదు పాపం.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు పదుల సంఖ్య దాటి బాధితుల సంఖ్య వందలు దాటుతుండడంతో పండుటాకులకు బతుకుపై భయం పట్టుకుంది. బాల్యం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలెదురైనా కలత చెందకుండా ధైర్యంగా ఎదుర్కొన్న ఆ గుండెల్లో లయతప్పుతోంది. కాటికి కాళ్లు చాపుకుని, ఏ ఆదరువు లేని సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా సాకులు చూపిస్తూ పింఛన్లు రద్దు చేయడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
దరఖాస్తు చేసుకున్నా కుదరదనడంతో మనస్థాపానికి గురైన వారు కొందరు, వైకల్యం ఉన్నా లేదనడంతో మనసు వికలమైన వారు మరికొందరు, వితంతువైనా కాదనడంతో కళ్లనీళ్లపర్యంతమైన వారు ఇంకొందరు ఇలా ఎందరెందరో బాధితులుగా మిగిలి పోతున్నారు. శేష జీవితంలో అష్టకష్టాలు పడలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుండడంతో ఆయా కుటుంబాల్లో ఆందోళన ప్రారంభమయింది. తన పింఛన్‌ను తొలగించారని మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కొంగపాడు గ్రామానికి చెందిన కావూరి సుబ్బులు (87) మృతి చెందిన సంగతి తెలిసిందే.
నెలకు రెండు వందలు వచ్చే పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్నది ఊడదియ్యడంతో కలకలం రేగుతోంది. ‘పండుటాకులం మా పింఛన్ ఎలా తీసేయ్యాలనిపించిందయ్యా, చూపు కనపడదు, నడవలేని స్థితిలో ఉన్న మా కడుపు కొట్టారయ్యా’ అంటూ వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పరిశీలన పేరుతో అధికార పార్టీ నేతలలో నింపేసిన కమిటీలు తమకు ఓటు వేయలేదనుకున్న వారి పేర్లను అర్హత ఉన్నా నిర్దాక్షణ్యంగా తొలగించేశాయి.
మరోవైపు గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సెర్ప్ అధికారులు ఆధార్‌లో లోపాలను వెతికి వ్యవసాయ భూమి ఉందన్న పేరుతో ఏకంగా 42 వేల పింఛన్లను నిలుపుదల చేశాయి. ప్రకాశం జిల్లాలో 3,12,000 పింఛన్లుండగా, గ్రామ కమిటీలు 37 వేల పింఛన్లు తొలగించాయి.
మరో 42 వేల పింఛన్లు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పూర్) ఆదేశాలతో తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 79 వేల మందికి పింఛన్ ఆగిపోయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పింఛన్ల తనిఖీ కమిటీకి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్ కాఫీలు ఇచ్చారు. గత నెలలో జరిగిన జన్మభూమి గ్రామసభల్లో అధికారులకు తగిన ఆధారాలు అందజేశారు. అధికారులు వీరందరినీ అర్హులుగా తేల్చారు. వచ్చేనెల నుంచి పింఛన్లు వస్తాయని హామీ కూడా ఇచ్చారు. కానీ పింఛన్లు రాకపోవడంతో ఆందోళనతో ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వేలి ముద్రలు సరిపోకపోవడంతో పింఛన్లు చాలా మందికి చేతికి అందడం లేదు.
వేటపాలెంలో జీడిపప్పు ఫ్యాక్టరీల్లోనూ, చేనేత పనుల్లో పనులుచేసేవారు ఉన్నారు. జీడి పప్పు ఫ్యాక్టరీల్లో పనిచేసేవారికి జీడి గింజలు పగలగొట్టే పనుల్లో కార్మికులకు చేతులకు జీడి అంటుకొని వేలిముద్రలు చెదిరిపోతాయి. వీరితో పాటు చేనేత కార్మికులు చేనేత పనులు చేసే సమయంలో వేలి ముద్రలు అరిగిపోతాయి. వీరితోపాటు రామన్నపేట పంచాయతీ పరిధిలోని లెప్రసీకాలనీ (కుష్టివ్యాధి కాలనీ)లో దాదాపు 50 కుటుంబాలు ఉంటున్నాయి. వీరికి చేతిలో కూడా వేలి ముద్రలు సక్రమంగా ఉండవు. వీరందరికి పింఛన్లు ఆగిపోయాయి. వీరితోపాటు వికలాంగులు, వితంతువులకు కూడా ఎటువంటి కారణాలు చూపకుండా పింఛన్లను తొలగించి వేయడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నేను ఆస్తిపరుడినా?
లింగసముద్రం: పంచాయతీలోని జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన కుమాళ్ల మాలకొండయ్యకు కుమ్మరి వృత్తి ఆధారం. ప్రస్తుతం 74 సంవత్సారాల వయసు. ఐదుగురు కుమార్తెలకు వివాహాలు అరుు్య వాళ్ల మెట్టింట్లో కాపురం చేసుకుంటున్నారు. మాలకొండయ్య తన భార్య బుజ్జమ్మ పొట్ట నింపుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆరోగ్యం సహకరించకపోరుునా ఆయన హూండీలు తయారు చేసి.. దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకుంటుంటాడు.
వీరికి పింఛన్ నగదు చేదోడు వాదోడుగా ఉండేది. అరుుతే ఈ వృద్ధుడు ఆస్తిపరుడని.. సంపాదన బాగా ఉందంటూ నిలువునా పింఛనుకు కత్తెర వేశారు. ఈ పరిణామంతో దిమ్మదిరిగిపోరుున మాలకొండయ్య.. తిరిగి పింఛను మంజూరు చేయూలంటూ అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నాడు. అలాగే మేదరమిట్లపాలేనికి చెందిన సొలస ఆదేమ్మకు 85 సంవత్సారాల వయసప్పుడు పింఛను తొలగించారు. జాబితాలో 50 ఏళ్లుగా నమోదైందంటూ ఈ చర్య తీసుకున్నారు.
- కుమాళ్ల మాలకొండయ్య, జంపాలవారిపాలెం (లింగసముద్రం)