భర్త పింఛనుకు భార్య అర్హురాలు అని చెప్పిన చట్టానికి.. భర్త చనిపోయాక భార్య ఎలా ఉండాలో చెప్పే అధికారం ఉంటుందా?!
అత్తగారి వయసు 77 ఏళ్లు. గత నెలలో ఆమె భర్త మరణించారు. అప్పటికి ఆయన వయసు 82 ఏళ్లు. చెన్నై పోర్ట్ ట్రస్ట్‌లోని ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో ఉన్న ‘సెటిల్‌మెంట్ వింగ్’లో పని చేస్తూ ఆయన 1993లో పదవీ విరమణ పొందారు. అప్పట్నుంచీ పింఛను వస్తోంది. నిబంధనల ప్రకారం భర్త చనిపోయాక, భార్య బతికి ఉన్నంత వరకు ఆమెకు ఆ పింఛను మొత్తంలో 70 శాతం వస్తుంది. అత్తగారిని తీసుకుని ఆమె కోడలు పింఛను దరఖాస్తు ఫారాలను ఇవ్వడం కోసం సెటిల్‌మెంట్ వింగ్‌కి వెళ్లారు. అక్కడ వీళ్లపని చూడవలసింది రవి అనే అధికారి. వీళ్లు వెళ్లేటప్పటికి ఆయన నిద్రపోతున్నాడు! ఆయన్ని లేపి, వచ్చిన పని గురించి చెప్పింది కోడలు. నింపుకొచ్చిన ఫారాలను కూడా ఇచ్చింది. అత్తగారి ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అడిగాడు ఆఫీసర్. వాటిని కూడా ఇచ్చింది. ఆమె అత్తగారు నాలుగు నెలల క్రితం తీయించుకున్న ఫొటో అది. ఎదురుగా ఉన్న అత్తగారిని, ఫొటోలో ఉన్న అత్తగారిని మార్చిమార్చి చూసి, ‘‘ఈ ఫొటో పనికిరాదు. వేరేది తీసుకురండి’’ అనేశాడు.
కోడలు ఆశ్చర్యపోయింది. ‘‘ఫొటోలో మీ అత్తగారు బొట్టుతో ఉన్నారు. భర్త చనిపోయిన మనిషి బొట్టుతో ఉండకూడదు’’ అని చెప్పాడు అధికారి. ఆయనే ఇంకో మాట కూడా అన్నాడు. ‘‘ఇప్పుడు తీయించుకునే ఫొటోలోనైనా మీ అత్తగారు తలగుడ్డ కప్పుకుని ఉండాలి. కుంకుమ బొట్టుకు బదులుగా విబూది పెట్టుకుని ఉండాలి’’ అని చెప్పాడు. ‘‘అయినా ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా! భర్త చనిపోయిన స్త్రీ ఎక్కడైనా బొట్టు పెట్టుకుంటుందా?’’ అన్నాడు. ఆ మాటకు కోడలు మనసు గాయపడింది. అత్తగారిని ఆ అధికారి అలా అనడం ఆమెకు నచ్చలేదు. ‘‘బొట్టుతో ఉంటే తప్పేంటి?’’ అని కోడలు ప్రశ్నించింది. దాంతో అతడికి కోపం వచ్చింది. ఫొటోతో వచ్చేటప్పుడు రేషన్ కార్డు కూడా తీసుకురండి అని మెలిక పెట్టాడు. నిజానికి రేషన్ కార్డు అవసరం లేదు. అయినా తెమ్మన్నాడు! కోడలి పేరు మాధురి. ఆమె తన అత్తగారికి (అత్తగారి పేరును గోప్యంగా ఉంచాం) జరిగిన అవమానాన్ని పై అధికారికి తెలియజేసింది. ఆయనా అలాగే అన్నాడు.
‘‘వాళ్లంతేనమ్మా’’ అని! ఇవన్నీ అలా ఉంచండి, అత్తగారు అపరాధభావంలో కూరుకుపోయారట! ‘‘నేను తప్పు చేశాను. ముందే.. బొట్టు లేకుండా ఫొటో తీయించుకుని వెళ్లవలసింది’’ అంటూ ఆమె విలపించడం చూసి కోడలు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చింది. ఒకవేళ ఆ పెద్దావిడ.. భర్త చనిపోయాక కూడా బొట్టు పెట్టుకుంటున్నా కూడా ప్రశ్నించడానికి చట్టానికి గానీ, సమాజానికి గానీ ఏం హక్కు ఉంటుంది? ఏమో.. భర్తే చెప్పి ఉండొచ్చు కదా.. నువ్వు ఎప్పటికీ బొట్టు తియ్యడానికి లేదని. అవన్నీ వ్యక్తిగతమైన విషయాలు. భర్త పింఛనుకు భార్య అర్హురాలు అని చెప్పిన చట్టానికి, భర్త చనిపోయాక భార్య ఎలా ఉండాలో చెప్పే అధికారం ఉంటుందా?! నిబంధనలు ఎన్ని ఉన్నా.. ఆయన భార్యే ఈవిడ అనే ఒక్క సాక్ష్యం సరిపోదా.. ఈ పండుటాకుకు గౌరవప్రదంగా పింఛను జారీ చెయ్యడానికి!
Comments
Please login to add a commentAdd a comment