ప్రారంభోత్సవానికి నోచుకోని పశువుల ఆస్పత్రి నూతన భవనం(పైన) ప్రస్తుతం వినియోగంలో ఉన్న శిథిలభవనం(కింద)
జగ్గంపేటలో శిథిలమైన పశువైద్యశాల
నాలుగేళ్లుగా బిక్కుబిక్కుమంటూ సిబ్బంది సేవలు
ప్రారంభం కాని నూతన భవనం
జగ్గంపేట (తూర్పుగోదావరి జిల్లా): గతమెంతో ఘనం... ప్రస్తుతం హీనం... ఇదీ జగ్గంపేట పశువుల ఆస్పత్రి పరిస్థితి. భవనం నిర్మించినా అది ప్రారంభం కాకపోవడం, సిబ్బంది అంతంతమాత్రంగా ఉండడంతో ఇక్కడ పశు వైద్యసేవలు అందడం లేదు. దీంతో పాడి రైతులు నానాఅవస్థలు పడుతున్నారు.
పెంకుల భవనంలో...
నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట పశువులాస్పత్రి భవనం భయపెడుతోంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పెంకుల భవనంలోనే వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. పెంకులు ఒక్కొక్కటిగా కిందకి జారిపోయి, పైకప్పు ఊడిపోయి, గోడలు బీటలు వారాయి. సుమా రు నాలుగేళ్ల క్రితం ప్రస్తుత కాకినాడ ఎంపీ, అప్పట్లో ఎమ్మెల్యే హోదాలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే భవన నిర్మాణ పనులు పలు సార్లు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టగా నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. దీంతో ఎస్టిమేషన్ రేట్లతో సంబంధిత కాంట్రాక్టర్ నిర్మాణం పనులను ఉపసంహరించుకున్నారు. సుమారు నాలుగేళ్లు సాగిన నూతన భవనం నిర్మాణ పనులు మరో కాంట్రాక్టర్ ద్వారా రివైజ్డ్ ఎస్టిమేషన్లతో చేపట్టారు. ఇంతా చేస్తే ఆ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.
గత వైభవం కోల్పోయి...
గతంలో జగ్గంపేట పశువులాస్పత్రికి పెద్ద పేరుండేది. గ్రామంలోని రైతులుతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలను తీసుకువచ్చి వైద్యం చేయించేవారు. ముఖ్యంగా చూడి పశువులకు వైద్య సేవలతో పాటు ఎదకు రాని గేదెలకు పరీక్షలు చేశారు. అలాగే గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందులు వేసేవారు. ఇక్కడ పనిచేసే వైద్యుడికి బదిలీ కావడం.. ఆయన స్థానంలో వైద్యుడు చాలా కాలం రాకపోవడంతో కేవలం కాంపౌండర్ మాత్రమే సేవలందించేవాడు. ఇటీవల అతడు కూడా బదిలీ అయ్యాడు. రెండు రోజుల క్రితం సత్యనారాయణ అనే వైద్యుడు విధుల్లోకి చేరారు. పూర్వ వైభవం తీసుకురావలసిన బాధ్యత ఆయనపైనే ఉందని రైతులు పేర్కొంటున్నారు.