గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్తురాలి కన్నీటి వినతి
దాతల సాయం కోసం ఎదురు చూపు
గోరుచుట్టుపై రోకటి పోటులా.. కిడ్నీ వ్యాధి కబళిస్తుంటే.. గుండె జబ్బు తోడైంది. వారానికోసారి డయాలసిస్ చేయించకపోతే ప్రాణాలకే ముప్పన్న వైద్యుల హెచ్చరిక చెవుల్లో మార్మోగుతోంది. మాయదారి జబ్బును వదిలించుకుందామంటే పేదరికం అడ్డం పడుతోంది. కిడ్నీ మార్పిడికి రూ.లక్షల వ్యయమవుతుంది. అయిదు వేళ్లు నోట్లోకెళ్లేందుకే ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. ఈ పరిస్థితిలో ఎలా వైద్యం చేయించుకోవాలో తెలియని ఓ ఇల్లాలు కుంగిపోతోంది. బతకాలని ఉందని కన్నీటితో వేడుకుంటోంది. దాతలు కరుణిస్తే ఆరోగ్యవంతురాలినౌతానంటోంది. ఆమె రాఘవాపురానికి చెందిన మారుమూడి లక్ష్మి.
చింతలపూడి : రాఘవాపురానికి చెందిన మారుమూడి లక్ష్మి రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోకపోతే ప్రాణానికి ముప్పని వైద్యులు హెచ్చరించారు. చెప్పారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం లక్ష్మిది. భర్త వెంకటేశ్వరరావు కూలి పనులకు వెళ్లి కూడబెట్టిన సొమ్ముతో భార్యకు వైద్యం చేయిస్తున్నాడు. దొరికిన చోటల్లా అప్పులు కూడా చేశాడు. భార్య అనారోగ్యంతో కుమార్తెను తమ్ముడి వద్ద ఉంచి చదివిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయాసంతో ఊపిరందక బాధపడుతున్న లక్ష్మిని కుటుంబ సభ్యులు చింతలపూడిలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చూపించారు. వారి సూచనలతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు లక్ష్మికి రెండు కిడ్నీలు పాడైనట్టు తెలిపారు.
కిడ్నీలతో పాటు గుండె కూడా పెరిగిందని చెప్పారు. అప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయిస్తున్నారు. డయాలసిస్‌కు తీసుకెళ్లి వచ్చేందుకు, మందులకు నెలకు రూ.8 వేల వరకు ఖర్చవుతోందని భర్త వెంకటేశ్వరరావు తెలిపాడు. స్థానిక బండి ఫౌండేషన్ నిర్వాహకుడు బండి రఘువీర్ తమ అవస్థ చూసి డయాలసిస్‌కు నెలకు రూ.వెయ్యి సాయం చేస్తున్నట్టు చెప్పాడు. కిడ్నీ మార్పిడి చేస్తే లక్ష్మి బతుకుతుందని, అందుకు రూ. 8 ల క్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపాడు. మనసున్న దాతలు 9542018305 నంబర్‌ను సంప్రదించాలి లేదా మారుమూడి వెంకటేశ్వరరావు, స్టేట్‌బ్యాంక్, చింతలపూడి శాఖకు చెందిన 31691258282 ఖాతా నంబర్‌కు విరాళాలు అందజేయాలి.
బతకాలని ఉంది..
Published Fri, Feb 20 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement