
పై‘లేట్’ ప్రాజెక్టు
పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చే పైలట్ ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్ల నుంచి ఊరిస్తోంది తప్ప ఆచరణకు నోచుకోలేదు.
- రెండేళ్ల నుంచి ఊరిస్తున్న పథకం
- రూ.35కోట్లు మంజూరైనా ప్రారంభం కాని పనులు
నక్కపల్లి, న్యూస్‌లైన్ : పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చే పైలట్ ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్ల నుంచి ఊరిస్తోంది తప్ప ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ప్రారంభం కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 105 గ్రామాల్లో దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం పెలైట్‌ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.35 కోట్లు మంజూరు చేసింది.
ఈ నిధులతో స్టోరేజీ ట్యాంకులను నిర్మించి అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు పైపు లైన్లు ద్వారా నీటిని సరఫరా చేయాలనేది ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని ఏలేరు కాలువ నుంచి ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. నాతవరం మండలం గొలుగొండపేట నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి స్టోరేజీ ట్యాంకుల్లో నిల్వచేసి, శుద్ధి చేసి అక్కడ నుంచి అవసరమైనగ్రామాలకు పైపులైన్ల ద్వారా నీరందించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశ్యం.
స్టోరేజీ ట్యాంకుల నిర్యాణం కోసం 40 ఎకరాల విస్తీర్ణం గల చెరువులు అవసరం కావడంతో ఉద్దండపురం ఊరచెరువు, గోపాలపట్నం ఆవ ప్రాంతాన్ని రెవెన్యూ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పరిశీలించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఉద్దండపురం చెరువు అయితే స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించారు. కానీ ఈ చెరువు కింద సుమారు 300 ఎకరాలు ఆయకట్టు ఉండడంతో రైతులు అంగీకరించడం లేదు.
అయితే సాగునీటికి ఇబ్బందులు లేకుండా చెరువును లోతుచేసి కొద్ది భాగం సాగునీటి కోసం కేటాయించి మిగతా భాగాన్ని స్టోరేజీ ట్యాంకుల కోసం వినియోగించుకొనేలా అధికారులు రైతులను ఒప్పించారు. స్టోరేజీ ట్యాంకుల పరిశీలనే తప్ప ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. రామచంద్రపురం పైలట్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన పైపులైన్లు ఏడాది క్రితం వచ్చిన తుపానుకు ధ్వంసమయ్యాయి.
మరమ్మతులు చేయించ డానికి లక్షలాది రూపాయలు వ్యయమవుతాయని అధికారులు చెబుతున్నారు. సరిపడా నిధులు లేకపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవ్వాలంటే కొత్తగా మంజూరైన పెలైట్ ప్రాజెక్టు ఒక్కటే మార్గమని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యేదెప్పుడో ప్రజల దాహార్తి తీరేదెన్నడో అధికారులకే తెలియాలి. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.