అందరికి ఆహ్లాదం పంచే తీరప్రాంతంపై కాలుష్య మేఘాలు కన్నెశాయి. సముద్ర సంపదకు ఆనవాళ్లుగా నిలిచిన దిండి పరిసర ప్రాంతాలను కలుషితం చేసే సమయం ఆసన్నమైనట్టు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తీరప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటును ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యతి రేకించి ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేశారు. అప్పట్లో ఆయన నిర్ణయానికి ప్రజలు కూడా సంతసించారు. అయితే ఇందుకు భిన్నంగా తీర ప్రాంతంలో కాలుష్య కలకలానికి తెరతీసినట్టు తెలుస్తోంది.
నిజాంపట్నం: తీరప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ‘దిండి కెమికల్ ఫార్మా పార్కు ప్రైవేటు లిమిటెట్’ సంస్థ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దిండి ప్రాంతంలో 1600 ఎకరాల భూములు కేటాయించాలని 2008 ఏప్రిల్‌లోనే అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ సంస్థ ప్రతిపాదనలను తిరస్కరించారు. రసాయన ఫ్యాక్టరీల నిర్మాణంతో తీర ప్రాంతానికి కాలుష్య ముప్పు ఉంటుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత కూడా ఆ సంస్థ 1200 ఎకరాలైనా కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది. ఆ ప్రతిపాదనా అదే రీతిలో నిలిచిపోయింది.
తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే ఆ నాడు దరఖాస్తు చేసుకున్న దిండి కెమికల్ ఫార్మా పార్కు ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పావులు కదపనారంభించింది. ప్రస్తుతం ఆ సంస్థకు అనుమతి లభించినట్టు ఇక్కడ ప్రచారం జరగడం కలకలం రేపుతోంది.
అనుమతులు నిలిపివేయాలి :
దిండి పరిసర ప్రాంతంలో కెమికల్ ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వచ్చిన ప్రచారం ఊపందుకుంది. తీరప్రాంతంలో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలు వదిలే కలుషిత వ్యర్థాల వల్ల మత్స్యసంపదకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలను ఎలా అనుమతిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంజూరు చేసిన అనుమతులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదంలో తీరం?
Published Sat, Sep 6 2014 1:24 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement