ప్రాణహిత కోసం ఉద్యమం
చేవెళ్ల-ప్రాణహిత రీ డిజైన్‌పై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం రేపు శంకర్‌పల్లిలో పనుల పరిశీలన కాలయాపనకే ‘పాలమూరు’ను తెరమీదకు తెచ్చారని ఆరోపణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘చేవెళ్ల- ప్రాణహిత’పై రాజకీయ పోరాటం మొదలైంది. నై పెట్టిన జిల్లా భూములను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు నుంచి జిల్లాను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది.
ఈ నెల 29న ప్రాజెక్టు పనులను పరిశీలించే ందుకు ఆ పార్టీ నేతాగణం శంకర్‌పల్లికి బయలుదేరనుంది. జిల్లాలో దాదాపు 2.46 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో అదిలాబాద్ జిల్లా ప్రాణహిత నుంచి గోదావరి జలాలను జిల్లాకు తరలించాలని గత ప్రభుత్వాలు నిర్ణయించాయి.
అందులో భాగంగా 23, 24, 25, 26 ప్యాకేజీల్లో సొరంగం నిర్మాణం, భూసేకరణ పనులు కూడా చేపట్టారు. త్వరలోనే జాతీయ హోదా లభిస్తుందని, అప్పటి నుంచి పనులు ఊపందుకుంటాయని భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటన రైతాంగం ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేస్తున్నామని ప్రాణహిత స్థానే కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని తీసుకురానున్నామని, అదే సమయంలో ఈ జలాలను మెదక్ వరకే పరిమితం చేయనున్నట్లు తేల్చిచెప్పారు. దీంతో ఈ ప్రాజెక్టుపై గంపెడాశలు పెట్టుకున్న పశ్చిమ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం, సిద్దలూరు, మోమిన్‌పేట తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.200 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతాలను మినహాయించడంతో ఈ నిధులను బూడిదలో పోసిన పన్నీరుగా భావించాల్సివస్తోంది.
కృష్ణా జలాలే శరణ్యం! ప్రాణహిత ప్రాజెక్టుకు మంగళంపాడిన ప్రభుత్వం.. కృష్ణా జలాలతో జిల్లాలో హరిత సిరులు పండించాలని నిర్ణయించింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాలో 1.70 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలని ప్రణాళిక రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రాజెక్టును డిజైన్ చేయడమేకాకుండా.. ఈ పనులకు సీఎం కేసీఆర్ గత నెలలో శంకుస్థాపన కూడా చేశారు. ఒక ప్రాజెక్టులో చూపిన ఆయకట్టును మరో ప్రాజెక్టులో ప్రతిపాదించడం కేంద్ర జలసంఘం (సీడబ్లుసీ) మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంటూ ప్రాణహిత నుంచి జిల్లాను తొలగించారు.
అంతేకాకుండా కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న జిల్లాకు గోదావరి నీటిని తీసుకురావాలనే ఉద్దేశం మంచిది కాదనే వాదనను తెరమీదకు తెచ్చిన ఇంజినీరింగ్ నిపుణులు ప్రాజెక్టు నుంచి మన జిల్లాను ఎత్తివేశారు. దీంతో స్వర్గీయ వైఎస్సార్ అంకురార్పణ చేసిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత -చేవెళ్ల సుజల స్రవంతి’ ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గండికొట్టినట్లయింది. ఇప్పటివరకు ఎలాంటి అనుమతుల్లేని పాలమూరు ప్రాజెక్టులో జిల్లాను చేర్చడం ద్వారా కృష్ణమ్మ పరవళ్లకు ఎన్నాళ్లు పడుతుందో కాలమే సమాధానం చెపుతుంది.