
కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ముగ్గు వేస్తున్న మహిళలు
సాక్షి, అనంతపురం : అనంతలో కేరళ సాంప్రదాయం ఉట్టిపడింది. ఆదివారం స్థానిక కృష్ణ కళామందిరంలో ‘ఓనం’ వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్థిరపడిన కేరళవాసులు పిల్లాపాపలతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఓనం వేడుకల్లో పాల్గొన్నారు. మలయాళీ సంప్రదాయ నృత్యాలు, ఇతర కార్యక్రమాలను నగరవాసులు ఆసక్తిగా తిలకించారు.
ఆకట్టుకున్న ఆటపాటలు
మహిళలు ప్రత్యేక పూలతో వివిధ రకాల రంగవల్లులను కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దారు. చుట్టూ చేరి పాటలతో అమ్మవారిని ఆరాధించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పురుషులకు టగ్ ఆఫ్ వార్, స్త్రీలకు మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి నిర్వహించారు. తెలుగు, మలయాళ సినీ పాటలకు యువతీ యువకులు, చిన్నారులు చేసిన డ్యాన్సులు హుషారెత్తించాయి. బాల బలిచక్రవర్తి వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం అనంతలో స్థిరపడిన సీనియర్ సిటిజెన్లను ఘనంగా సన్మానించారు. ఆటపాటలతో అలరించిన వారికి జ్ఞాపికలను అందించారు.
అన్ని పండుగలూ ఆనందంగానే..
కార్యక్రమంలో అనంతపురం మలయాళీ సమాజం అధ్యక్షుడు నందకుమార్ మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుండో వచ్చి జిల్లాలో స్థిరపడిన మలయాళీలు తమ సంప్రదాయాలను మరచిపోకూడదనే ఉద్దేశంతో ఓనం వేడుకలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 80 ఏళ్ల కిందట ఇక్కడికొచ్చేసిన తమకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు. తెలుగు వారితో మమేకమైపోవడం వల్ల అన్ని పండుగలనూ ఆనందంగా జరుపుకొంటామన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి, బత్తలపల్లి నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన మలయాళీలతోపాటు అనంత మలయాళీ సమాజం నిర్వాహకులు బాలాజీ నాయర్, షణ్ముక రాజా, సూర్యనారాయణ, శేషాద్రి, సునీల్, విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment