
దూసుకొచ్చిన మృత్యువు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక) : రోడ్డు దాటుతున్న వృద్ధ దంపతులను లారీ ఢీ కొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా వృద్ధురాలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి సుమారు 9.30 గంటల ప్రాంతంలో నేరెళ్ల కృష్ణయ్య (70), నర్సయమ్మ (60) తుంగ్లాంలో ఉంటున్న కుమారుడు సోంబాబు, నాతయ్యపాలెంలో ఉంటున్న కుమార్తె రమణమ్మ, అక్కిరెడ్డిపాలెంలో ఉంటున్న మంగమ్మలను చూడటానికి వారి స్వస్థలం తగరపువలస సమీపంలోని గ్రామం నుంచి వచ్చారు.
అక్కిరెడ్డిపాలెంలో ఉన్న కుమార్తె వద్దకు సాయంత్రం వచ్చి నాతయ్యపాలెంలో ఉన్న కుమార్తెను చూడటానికి అక్కిరెడ్డిపాలెం బస్టాప్ ఎదురుగా నాతయ్యపాలెం వైపు గ్రీనరీ కోసం నిర్మిస్తున్న రెండు గోడలను దాటి రోడ్డు దాటుతున్నారు. గ్రీనరీ దాటిన ఇద్దరు వృద్ధులు ఒక్కసారిగా రోడ్డు మధ్యలోకి వచ్చిన తర్వాత గాజువాక నుంచి ఎన్‌ఏడీ వైపు వెళ్తున్న లారీ వీరిరువురిపై నుంచి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు మాసం ముద్దగా మారి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వృద్ధురాలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న కుమార్తె రమణమ్మ తల్లిదండ్రుల మరణవార్త విని కన్నీరుమున్నీరుగా విలపించింది. గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.