వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం): వాతావారణం ఒక్కసారిగా చల్లబడటంతో.. కాగితాలు పోగేసి నిప్పంటించి దాని చుట్టు కూర్చొని చలిమంట కాగుతుండగా అందులో ఉన్న పేలుడు పదార్థాలు పేలడంతో ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలోని శివసాగర బీచ్‌వద్ద శుక్రవారం సాయత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు చలి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్న చెత్త కాగితాలను పోగేసి మంట పెట్టి దాని చూట్టూ చేరి చలి కాచుకుంటున్నారు.
అయితే అందులో నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇది గుర్తించిన తోటి మత్స్యకారులు క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఈ ఘటనలో పొట్టిరాజు(45) అనే వ్యక్తి మృతిచెందగా, నారాయణరావు(46) అనే వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.