దిక్కులు పిక్కటిల్లాయి.. వందలు కాదు.. వేలు కాదు.. దాదాపు లక్ష మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులు అందరూ ఒక్కటయ్యారు. సమైక్యంగా తమ సమైక్య గళాన్ని వినిపించారు. కర్నూలు నగరం నడిబొడ్డున సమైక్య వాదానికి స్ఫూర్తినిచ్చేలా, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా 'లక్ష గళ ఘోష' పేరుతో మహోద్యం చేశారు. ఉదయం పది గంటలకే ప్రారంభమైన ఈ మహా నిరసన రెండున్నర గంటల పాటు నిరాఘాటంగా సాగింది.
జేఏసీ చైర్మన్ చెన్నయ్య నేతృత్వంలో కర్నూలు రాజ్‌విహార్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులు తమ తమ విద్యాసంస్థల నుంచి ర్యాలీగా బయల్దేరి ఉదయం పది గంటలకల్లా నిరసన ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలు ప్రధానంగా సి.క్యాంపు, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, ఆర్‌ఎస్ రోడ్డు మీదుగా సాగాయి.
విద్యార్థులతో పాటు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న అన్ని రకాల జేఏసీ నాయకులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినట్లు జేఏసీ చైర్మన్ చెన్నయ్య తెలిపారు. 9 గంటల నుంచి 10.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లక్షమంది ఒకే చోట చేరినా, ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా లేకుండా అత్యంత ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తామన్న ఢిల్లీ దిమ్మ తిరిగేలా సమైక్యాంధ్ర నినాదాన్ని లక్షల గొంతులతో వినిపించారని ఆయన చెప్పారు.