
స్నేహితుడి కోసం వెళ్తూ మృత్యు ఒడికి..
ముక్కామల(అంబాజీపేట) :స్నేహితుల దినోత్సం సందర్భంగా స్నేహితుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్తున్న ఓ యువకుడిని మృత్యువు కబళించింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పి.గన్నవరం మండలం కుందాలపల్లి (అవిడి డాం)కు చెందిన మట్టపర్తి దుర్గాప్రసాద్ (26) ఆదివారం తెల్లవారుజామున గంటిపెదపూడిలోని తన అత్తగారింటి నుంచి పల్సర్ మోటారు బైక్‌పై అయినవిల్లి మండలం మూలపాలెంలో ఉన్న తన స్నేహితుడు శంకర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళుతున్నారు.
అంబాజీపేట మండలం ముక్కామల పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ తలకు బలమైన గాయమైందని, అందువల్లే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. దుర్గాప్రసాద్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. భార్య, ఆరు నెలల బాబు ఉన్నారు. విజయవాడలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి గంటిపెదపూడిలోని తన అత్తగారింటికి వచ్చాడు. దుర్గాప్రసాద్ అత్త కాండ్రేగుల రామలక్ష్మి బోరున విలపిస్తూ తన కుమార్తె జీవితం తెల్లారిపోయిందని.. ఆమెకు ఎవరు దిక్కని.... ఆరు నెలల పిల్లవాడు తండ్రిలేని అనాథైపోయాడని రోధించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు.