సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మరోసారి వివాదంలో పడింది. జెడ్పీటీసీ పదవికి అనర్హుడిని చేస్తూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో సోమవారం హడావిడిగా ఆ సీటులో ఈదర హరిబాబు ఆశీనులుకావడం వివాదాస్పదంగా మారింది. హైకోర్టు ఆదేశాలు కలెక్టర్‌కు అందిన తర్వాత దాన్ని పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించాలి.
అక్కడి నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత మళ్లీ సీటులో కూర్చోవాల్సిన ఈదర అవేవీ పట్టించుకోకుండా ..జిల్లాపరిషత్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నూకసాని బాలాజీ లేని సమయంలో జెడ్పీ కార్యాలయానికి వెళ్లి సీట్లో కూర్చోవడమే కాకుండా విలేకర్ల సమావేశం కూడా పెట్టారు. ఈదర హరిబాబుపై సస్పెన్షన్ వేటు పడటంతో పూర్తిస్థాయి ఛైర్మన్‌గా నూకసాని బాలాజీకి అధికారులు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అధికారుల నుంచి ఈదర హరిబాబుకు ఆదేశాలు రావాల్సి ఉంది.
అవి వచ్చిన తర్వాత నూకసాని బాలాజీతో మాట్లాడి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే నూకసాని బాలాజీ శ్రీశైలం వెళ్లిన సమయంలో ఈదర వచ్చి సీటులో కూర్చున్న తరువాతనే బాలాజీకి ఫోన్ చేసి ఛైర్మన్‌ను మాట్లాడుతున్నానని చెప్పడంతో నూకసాని బాలాజీ మంచిది, కంగ్రాట్స్ అని సమాధానమిచ్చారు. దీనిపై నూకసాని బాలాజీ మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, అధికారులకు ఆదేశాలు రాకముందే వచ్చి సీట్లో కూర్చోవడం అహంకారపూరితమేనని విమర్శించారు.
కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈదర తెలుగుదేశం నేతల మద్దతు కోసం ప్రయత్నించారు. అయితే ఈదరకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించడానికి ఆ పార్టీ నేతలు ఇష్టపడలేదని సమాచారం. తాను వారి మద్దతు కోసం చేయి చాచినా తిరస్కరిస్తున్నారని, రాష్ట్రస్థాయిలో తనకు సహకారం ఉన్నా జిల్లాలో ‘ఇద్దరు’ తనను వ్యతిరేకిస్తున్నారని ఈదర వ్యాఖ్యానించడం గమనార్హం. అదివారం జిల్లా మంత్రిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లి రెండు గంటలపాటు వేచి చూసినా మంత్రి శిద్దా రాఘవరావు కలవడానికి ఇష్టపడలేదని తెలుగుదేశం శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈదర హడావిడిగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన సుజనా చౌదరిని కలిశారు.
అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. మరోవైపు హైకోర్టు తీర్పుపై తెలుగుదేశం నాయకులు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో హడావిడిగా ఈదర జెడ్పీ సీట్లో కూర్చున్నట్లు సమాచారం. వారి మద్దతు కోరుతున్నానని చెబుతున్న ఈదర అవసరమైతే సుప్రీం కోర్టులో కూడా వారితో పోరాటానికి సన్నద్దమేనని చెప్పారు. కోర్టు ఆదేశాలు అందకుండానే బాధ్యతలు స్వీకరించడానికి ఈదర వస్తున్నట్టు తెలుసుకున్న జెడ్పీ అధికారులు ఎందుకైనా మంచిదని అందుబాటులో లేకుండా పోయారు. ఈదర వ్యవహరంపై జిల్లా కలెక్టర్ విజయకుమార్‌తో ‘సాక్షి’ మాట్లాడగా తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. కోర్టు ఆదేశాలు కూడా తనకు అందలేదని స్పష్టం చేశారు.
జెడ్పీలో మరో వివాదం
Published Tue, Nov 11 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement