ఒంగోలు: జెడ్పీ చైర్మన్‌ను తానేనని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబరులో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తాను తాత్కాలికంగా మూడు నెలలపాటు జెడ్పీ చైర్మన్ పదవికి దూరం కావాల్సి వచ్చిందన్నారు. విప్ ధిక్కరించానంటూ జిల్లా కలెక్టర్ తన జెడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దుచేసిన విషయాన్ని గుర్తు చేశారు.
దీనిపై న్యాయం పోరాటం చేయగా రాష్ట్ర హైకోర్టు తనకు ఇచ్చిన విప్ చెల్లదని పేర్కొనడంతో జెడ్పీటీసీకి అర్హుడినయ్యానని, జెడ్పీటీసీగా అర్హుడినైనప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి కూడా ఆటోమేటిక్‌గా అర్హుడినేనని అన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి తిరిగి జెడ్పీ చైర్మన్‌గా విధుల్లోకి వచ్చినట్టేనని, అయితే ఛాంబర్‌లోకి మాత్రం కార్తీక మాసం, సోమవారం కావడంతో ఈ రోజు అడుగు పెట్టానని అన్నారు. తనను అనర్హుడిగా చేసేందుకు అధికార పార్టీ వారికి ఉన్న అవకాశాన్ని వారు వినియోగించుకున్నారని మాత్రమే వ్యాఖ్యానించగలనని, కోర్టు పరిధిలోని అంశం కావడం, తాను జెడ్పీ చైర్మన్ పదవిలో ఉన్నందున రాజకీయ అంశాలపై మాట్లాడదలుచుకోలేదన్నారు.
తన పదవికి సంబంధించి జరుగుతున్న సమస్యంతా టీడీపీ రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధంలేదని, కేవలం స్థానిక రాజకీయ పరిణామాల్లో ఇదో చిన్న అంశం మాత్రమేనని అన్నారు. త్వరలోనే అది సమసిపోతుందని భావిస్తున్నానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పని చేస్తూ రాష్ట్రాభివృద్దిలో భాగం పంచుకుంటానన్నారు. జడ్పీచైర్మన్ సీట్లో కూర్చునే ముందు ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసిన నూకసాని బాలాజీతో మాట్లాడానని, ఆయన కూడా తనకు శుభాకాంక్షలు తెలిపారన్నారు.
ప్రజా దర్బార్లతో...
ఈ పరిణామాలతో ఉద్యోగుల్లో కొంత అలసత్వం చోటుచేసుకుందని, కేవలం మూడు నెలల్లోనే జెడ్పీ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానన్నారు. దీనికిగాను జెడ్పీకి సంబంధించిన ప్రతి వ్యవహారాన్నీ ఆన్‌లైన్‌లో పెట్టనున్నట్టు చెప్పారు. జెడ్పీ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా దర్భార్‌ను నిర్వహిస్తానన్నారు. జిల్లాలోని 56 మంది జెడ్పీటీసీలతో కలిసి రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తానని, ఇప్పటివరకు నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇక ఆగిపోతుందని భావిస్తున్నానన్నారు.
అయితే టీడీపీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోందని విలేకర్లు ప్రశ్నించగా అటువంటి పరిస్థితి వస్తే తాను కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు తాను వారసుడిని అన్నారు. నాగులుప్పలపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజావలీ తదితరులు పాల్గొని ఈదర హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
జెడ్పీ చైర్మన్‌ను నేనే
Published Tue, Nov 11 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement