విప్ ఇవ్వలేదు... ఇంకా ధిక్కరించేదెక్కడ
ఒంగోలు : అసలు నాకు విప్ ఇవ్వలేదు. ఇంకా ధిక్కరించే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది. ఇదీ... విప్ ధిక్కరించినందుకు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన షోకాజ్ నోటీస్కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈదర హరిబాబు ఇచ్చిన సమాధానం. ఈనెల 13న జరిగిన జెడ్పీ ఛైర్మన్ ఎన్నికలో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే.
దీనిపై టీడీపీ సీరియస్గా స్పందించిన ఈదర హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా విప్ ధిక్కరించినందుకు అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ప్రిసైడింగ్ అధికారి హోదాలో కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. గడువు ముగియటంతో డీఆర్వోకు ఈదర హరిబాబు సమాధాం అందచేశారు.
అందులో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ జారీ చేయలేదని, అందువల్ల తనకు విప్ గురించి తెలియదని సమాధానం ఇచ్చారు. విప్ ఇవ్వనపుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఉత్పన్నం కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈదర సమాధానంపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.