విన్నపాలు వినవలె..
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మొదటిసారిగా శుక్రవారం ప్రారంభమైన ప్రజాదర్బార్‌కు జన సందోహం వెల్లువెత్తింది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఫిర్యాదులు పట్టుకొని ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ప్రజాభవన్‌కు తరలివచ్చారు. వేలాది మంది రావడంతో బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాస ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది.
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి ఉదయం దాదాపు 10.15 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ విషయంలో ఏం చేయాలో చూడాలని సీఎం అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. మరికొందరు రోడ్లు, భూములు, ఇతర సమస్యలను ప్రస్తావించారు. గంటసేపున్న సీఎం ప్రతి ఒక్కరి సమస్యలు ఓపిగ్గా విన్నారు. అనంతరం ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిమిత్తం సచివాలయానికి వెళ్లారు.
ఆ తర్వాత మంత్రి సీతక్క ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతిఒక్కరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. మధ్యాహ్నం మూడున్నర వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమం వారంలో రెండురోజులు నిర్వహించేలా.. శాఖల వారీగా ఫిర్యాదులు స్వీకరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే దీనికి సీఎం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.
320 సీట్లు .. 15 డెస్కులు ..మౌలిక వసతులు
ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. సమస్యల నమోదుకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ప్రతి విజ్ఞాపన పత్రాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసి, ప్రతి విజ్ఞాపనకు ప్రత్యేక గ్రీవెన్స్ నంబర్ ఇచ్చి, ప్రింటెడ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం, పిటిషన్ దారులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఎక్ నాలెడ్జ్జ్‌మెంట్ పంపే విధంగా ఏర్పాటు చేశారు. ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా నీడతో కూడిన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు.
హర్షాతిరేకాలు
ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలు ప్రగతిభవన్ తలుపులు అందరికీ తెరుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజాదర్బార్ నిర్వహించారంటూ గుర్తు చేసుకున్నారు. గడీల పాలనకు చరమగీతం పాడారంటూ కొందరు పాటలు పాడారు. కొందరు ప్రగతిభవన్ పైకి ఎక్కి అంతా కలియదిరిగారు. పచ్చిక బయలుపై, భవనాల వద్ద పెద్ద ఎత్తున ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు.
ప్లాట్లు కబ్జా చేశారు
మా అసోసియేషన్‌కు సంబంధించిన ప్లాట్లను కొందరు కబ్జా చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే విచారించారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టి కబ్జా చేశారని తేలింది. ఎమ్మార్వోపై చర్య తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇప్పటివరకు మోక్షం లభించలేదు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాం. త్వరగా న్యాయం చేయాలని కోరేందుకు వచ్చా. –దామోదర్‌రెడ్డి, చాణిక్యపురి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, నాదర్గుల్, రంగారెడ్డి జిల్లా
మా పేరు మీద పట్టా చేయించాలి
మా భూమి మా పేరు మీద పట్టా చేయించాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారే తప్ప పట్టా చేయించడం లేదు. ఐదు మందిమి ఉన్నా పట్టాలు ఇవ్వలేదు. లక్షలు ఇవ్వాలంటున్నారు. పేదోళ్లం అంత డబ్బులు ఎలా ఇవ్వగలం? – గిరన్న, బాలమ్మ,కాశింనగర్ గ్రామం, వనపర్తి జిల్లా