ఉల్లిక్కిపాటు | onion price increase | Sakshi
Sakshi News home page

ఉల్లిక్కిపాటు

Published Fri, Aug 28 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

onion price increase

ఉల్లిపాయ..ఈ పేరు చెబితే జనం ఉలిక్కిపడుతున్నారు. ఉల్లి ధరలు పెరిగి నెల కావస్తున్నా.. ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. కేవలం రైతు బజార్లలో కిలో 20 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న పాలకులు డిమాండ్‌కు తగ్గట్టుగా ఇక్కడ కూడా సరఫరా చేయడంలేదు. దీంతో రెండు కేజీలో ఉల్లిపాయల కోసం కాళ్లు వాచిపోయేలా..గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అయినా..బహిరంగ మార్కెట్‌లో కిలో సుమారు రూ. 50 నుంచి 60 రూపాయలు పలుకుతుండడంతో జనం రైతు బజార్ల బాటపడుతున్నారు.
 
 పీఎన్‌కాలనీ:ఉల్లిపాయల ధరలు అమాంతం పెరగడానికి కారణాలు ఏమైనప్పటికీ..జనానికి మాత్రం పాట్లు తప్పడం లేదు. వ్యాపారులే కావాలని కృత్రిమ కొరత సృష్టించడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు నిత్యం కర్నూలు, నాసిక్, లాసెన్‌గౌవ్, బళ్లారి నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది. ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య కారణాలతో సరఫరాను నిలిపివేశారు. దీంతో జిల్లా వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు రోజుకు దాదాపుగా 40 టన్నులు అవసరం ఉన్నప్పటికీ రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లకు కలిపి కేవలం 27 టన్నులే సరఫరా చేస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది దళారులు కృత్రిమ కొరతను సృష్టించి ఏకంగా లక్షల సొమ్మును పోగుచేసుకుంటున్నారే విమర్శలు వస్తున్నాయి.పనులు మానేసి రైతుబజార్ల బాట
 బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.50 నుంచి 60 రూపాయలు పలుకుతుండడంతో
 
 రైతు బజార్లవైపు జనం పరుగుతీస్తున్నారు. పేద, మధ్యతరగతి, ఉద్యోగులనే తేడాలేకుండా రెండు కిలలో సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజార్లలో పడిగాపులు పడుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారులు, కార్మికులు పనులు మానేసి ఉల్లికోసం రైతు బజార్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా కుటుంబ సభ్యులతో వచ్చి ఒక్కో కౌంటర్‌లో రెండేసి కేజీలు తీసుకుని వాటిని బయట రూ. 50 నుంచి 60 రూపాయలకు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని  రైతుబజారు అధికారులు గమనించి ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఒరిజినల్ రేషన్‌కార్డు తీసుకురావాలని నిబంధనను తీసుకొచ్చారు.
 
 దీంతో కొంతవరకు అక్రమాలు అరికట్టగలిగారు. అయితే రోజుకో కార్డు తీసుకురమ్మని అధికారులు చెబుతుండడంతో ఉల్లిపాయల కోసం వచ్చేవారు తికమకపడుతున్నారు. దీనికితోడు జనం తాకిడి ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ  శ్రీకాకుళం రైతు బజార్‌లో కేవలం నాలుగు కౌంటర్లలోనే ఉల్లిని విక్రయిస్తున్నారు. దీంతో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ల సంఖ్యను పెంచాలని అధికారులను వేడుకుంటున్నారు. బుధవారం నాడు హోరు వర్షంలో కూడా జనం ఉల్లిగడ్డల కోసం రైతు బజార్లో నిరీక్షించారంటే డిమాండ్ ఎంతలా ఉందో అధికారులు గమనించాలని ప్రజలంటున్నారు.
 
 గ్రామీణుల పరిస్థితి మరీ ఘోరం!
 జిల్లాలోని ఆమదాలవలస, శ్రీకాకుళంలో మాత్రమే రైతు బజార్లు ఉన్నాయి. ఈ రెండుచోట్టే సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తున్నారు. అలాగే ఐటీడీఏ పరిధిలో జీసీసీ ద్వారా సంతల్లో విక్రయిస్తున్నారు. దీంతో ఈప్రాంతాల్లో ఉన్నవారి పరిస్థితి కొంతమెరుగ్గా ఉండగా.. గ్రామీణుల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. వీరు కిలో ఉల్లిని సుమారు 60 రూపాయల చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వీరు సబ్బిడీ ఉల్లికి నోచుకోనప్పటికీ అధికారులు పట్టించుకోడం లేదు.
 
  తగినన్ని సరఫరా లేకపోవడమే కారణం
   జిల్లా ప్రజల వినియోగానికి తగ్గట్టుగా ఉల్లి సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు రైతు బజార్ల వద్ద క్యూల్లో ఉంటున్నారు. జనాభాకు తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేద్దామంటే వినియోగదారులు అన్ని కౌంటర్లలో తీసుకుంటున్నారు. అవసరానికి తగ్గట్టుగా పంపిణీ చేస్తే సమస్య ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement