ఆన్‌లైన్ యోచన విరమించుకోవాలి
దస్తావేజు లేఖర్ల సమ్మె
కడప సెవెన్‌రోడ్స్ : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో ఇకమీదట ఆన్‌లైన్ పద్ధతి తీసుకు రావాలన్న ప్రభుత్వ యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని దస్తావేజు లేఖర్లు శుక్రవారం సమ్మెలోకి వెళ్లారు. డాక్యుమెంట్‌రైటర్ల ప్రమేయం లేకుండా ఎవరికి వారు స్వంతంగాఆన్‌లైన్‌లో దరఖాస్తు పొంది కావాల్సిన తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానాన్ని ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సేల్ డీడ్, గిఫ్డ్ డీడ్ తదితరాలకు అవసరమైన డాక్యుమెంటు నమూనాను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పొందుపరచనుంది.
ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వ్యక్తి వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తులో ఆధార్ ఎంటర్ చేయగానే డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు, వేలిముద్రలతోసహా అందులోకి వస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధిం చిన ఖాళీల్లో విస్తీర్ణం హద్దులను పూరించాల్సి ఉంటుంది. మార్కెట్ విలువ కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకుని బ్యాంకు ఖాతా నుంచే నగదు బదిలీ ద్వారా చలానా అవసరం లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటారో అందులో తెలిపితే ఖాళీలను బట్టి స్లాట్ కేటాయిస్తారు. ఆరోజున వెళితే మరోమారు వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ల శాఖలో దళారీల ప్రమేయాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అయితే ఈ విధానం వల్ల ఎన్నో దశాబ్ధాలుగా ఉపాధి పొందుతున్న తాము రోడ్లపాలు కావాల్సి వస్తుందని దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లెసైన్స్ విధానం ద్వారా దస్తావేజులు రాసే పద్దతిని పునరుద్దరించాలని లేఖర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వేణుగోపాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల క్రయ విక్రయాల దస్తావేజులను పూర్వం గ్రామ కరణాలు, మునసబ్‌లు రాస్తేండేవారని, దీనివల్ల గ్రామ పాలన కుంటుపడేదన్నారు.
దీంతో దస్తావేజు లేఖర్ల వృత్తిని చట్టబద్దత చేస్తూ లెసైన్స్ విధానాన్ని గతంలో ప్రవేశ పెట్టారని వివరించారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఈ వృత్తిని ఎంచుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొస్తే అందువల్ల అనేక తప్పిదాలు చోటుచేసుకుని శాఖాపరం గా ఇబ్బందులు వస్తాయన్నారు. శనివా రం కూడా తమ సమ్మె కొనసాగుతుందన్నారు. దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు సంజీవరాయుడు, నాయకులు ఎం.మల్లేష్, సి.నాగరాజు, ఇక్బా ల్, వెండర్లు లోకనాథం, హరికృష్ణ, జయమ్మ, అరుంధతి పాల్గొన్నారు.