ఆన్‌లైన్‌ అగచాట్లు..! | online problems | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ అగచాట్లు..!

Published Tue, Mar 6 2018 11:40 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

online problems - Sakshi

వెబ్‌అడంగల్‌కు సంబంధించి అక్రమాలకు వేదికగా నిలిచిన సంతకవిటి తహసీల్దార్‌ కార్యాలయం

భూమి అంటే రైతుకు ఆరోప్రాణం! పట్టాదారు పాస్‌బుక్, భూయాజమాన్య హక్కు పుస్తకం (టైటిల్‌డీడ్‌) వారికి ఆయువుపట్టు! తమ హక్కుకు, హోదాకు అవే చిహ్నాలు! రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నెలల క్రితం వాటికి చెల్లుచీటి చెప్పేసింది! రైతులు తమ భూమి వివరాలు చూసుకోవాలన్నా, క్రయవిక్రయాలు చేసుకోవాలన్నా, చివరకు బ్యాంకు నుంచి పంటరుణాలు పొందాలన్నా... అన్నింటికీ ఆధారం ఆన్‌లైన్‌లోని ‘మీ భూమి’ పోర్టలేనంటూ కొత్త వ్యవస్థను తెచ్చింది! అవినీతికి, అలసత్వానికి ఆస్కారం లేకుండా చూడటానికే వెబ్‌ల్యాండ్‌ విధానం తెచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ కాగితరహిత వ్యవహారం ఇప్పుడు రైతులకు చుక్కలు చూపిస్తోంది. అడంగల్, ఒన్‌–బీలో తప్పులు సరిదిద్దుంచుకోవడానికి పదేపదే దరఖాస్తు చేసుకుంటూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కొంతమంది రెవెన్యూ సిబ్బంది మామ్మూళ్ల కోసం వారిని ముప్పతిప్పలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

  పక్క చిత్రంలోని రైతు పేరు అన్నాబత్తుల మహేశ్‌... రణస్థలం మండలం గరికిపాలెం రెవెన్యూ గ్రామానికి చెందిన అతనికి  సర్వే నంబర్లు 35/11, 35/4, 35/5లో 2.41 ఎకరాలు జిరాయితీ భూమి ఉంది. నంబరు 22/2 కింద ప్ర భుత్వ భూమిగా నమోదు అయిఉంది. ఈ రెవెన్యూ గ్రామంలో 21 మంది రైతుల సర్వే నంబర్లు తప్పుగా పడ్డాయి. మ్యుటేషన్‌ చేసి సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా, మీసేవలో దరఖాస్తు చేసుకున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన చెందుతున్నారు. సబ్‌ డివిజన్‌ సర్వే నంబరు వేసి, రైతు జిరాయితీగా సరిచేయాలి. 1–బీ, పాస్‌ పుస్తకాలు అందజేయాలి. కానీ అలా జరగట్లేదు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా 5 లక్షల హెక్టార్ల భూమి ఉంది. దీనిలో రైతుల ఆధీనంలో ఉన్న సాగుభూమి సుమారుగా 3 లక్షల హెక్టార్ల వరకూ ఉంటుంది. దీనిపై ఆధారపడిన సన్నకారు, పెద్ద రైతులు దాదాపుగా 5.5 లక్షల మంది ఉన్నారు. వారివద్ద ఆ భూములపై హక్కును తెలియజేసేందుకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు (దస్తావేజులు)తో పాటు ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలు గతంలో ఉండేవి. జిల్లాలో దాదాపు 3.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు వివిధ దశల్లో మంజూరయ్యాయి.

అయితే ఈ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసే ప్రక్రియ నాలుగున్నరేళ్ల క్రితమే ప్రారంభమైంది. దీనికి గత ప్రభుత్వం ‘వెబ్‌ల్యాండ్‌’ అని పేరుపెట్టింది. అయినప్పటికీ పాస్‌పుస్తకాలు రద్దు చేయబోమని, వాటి ఆధారంగా రుణాల మంజూరు, క్రయవిక్రయాలు నిర్వహించుకోవచ్చని చెబుతూ వచ్చింది. కేవలం భూమి వివరాలు, యాజమాన్య హక్కు వివరాలు పారదర్శకంగా ఉండాలని, రికార్డు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు రైతులకు అభయమిచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం ‘మీ భూమి’ పోర్టల్‌ను తెరపైకి తీసుకొచ్చి ంది. రైతులు ప్రాణంగా చూసుకొనే పట్టదారు పాస్‌పుస్తకాలకు మంగళం పాడేసింది. 

తీరని బాలారిష్టాలు...
ఏటా దాదాపు 2.50 లక్షల మంది వరకూ ఖరీఫ్‌లో, 20 వేల మంది వరకూ రబీ సీజన్‌లో బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 41 బ్యాంకులకు సంబంధించిన 302 శాఖల ద్వారా గత ఖరీఫ్‌లో రూ.1,700 కోట్లు వ్యవసాయ రుణాలుగా అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ 2.30 లక్షల మంది సుమారు రూ.1,400 కోట్ల రుణాలు మాత్రమే పొందారు. కానీ వెబ్‌ల్యాండ్‌ విధానం అమల్లో బాలారిష్టాలు తీరలేదు. భూసమస్యల పరిష్కారం కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దాఖలు చేసుకుంటున్న ఫిర్యాదులు లక్షల్లోనే ఉంటున్నాయి.

వాటిలో ఎక్కువ మ్యూటేషన్, కరెక్షన్‌ కోసం దాఖలు చేసినవే. ఇవి పరిష్కారం గాకపోవడంతో బ్యాంకు రుణాలకే గాకుండా రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతుల భూములకు అడంగల్, 1బీ చాలా ముఖ్యం. భూముల క్రయవిక్రయాలతో సర్వే నంబర్లలో తప్పులు, భూవిస్తీర్ణంలో తేడాలు సరి చేయడానికి మ్యుటేషన్, కరెక్షన్‌ల కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సాధారణంగా ఈ ప్రక్రియను 21 రోజుల గడువులో పూర్తి చేయాలి. కానీ ఈ సమయంలో ఏదైతే భూమికి సంబంధించి మ్యుటేషన్‌ లేదా కరెక్షన్‌ కోసం దరఖాస్తు చేశారో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబరులోని మిగతా రైతులకూ 1బీ జారీ కావట్లేదు. 

సర్కారు స్పందన కరువు...
వెబ్‌ల్యాండ్‌ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై తహసిల్దార్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర భూపరిపాలన విభాగానికి (సీసీఎల్‌ఏ) ఎప్పటికప్పుడు ఆన్‌లైన్, ఫోన్‌ ద్వారానే గాకుండా వీడియో కాన్ఫెరెన్స్‌ల్లోనూ నివేదిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌ అమల్లో ఎదుర్కొంటున్న సాంకేతికపరమైన సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకొంటున్నారు. కానీ ఫలితం ఉండట్లేదు. జిల్లాలో వెబ్‌ల్యాండ్‌ సమస్యలు నానాటికి పెరుగుతున్నాయి. ఏటా ‘రైతు సేవలో రెవెన్యూశాఖ’ పేరుతో రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించినా ఫలితం కనిపించట్లేదు.
 
అలసత్వమూ, మామూళ్ల మత్తు...
ఇటీవల పాస్‌ పుస్తకం కోసం ఎచ్చెర్ల డిప్యూటీ తహసిల్దారు రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇద్దరు వీఆర్వోలు కూడా రూ.5 వేలు చొప్పున రైతుల నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మరోవైపు ఎన్నిసార్లు ‘మీ–సేవ’ కేంద్రాల్లో వ్యయప్రయాసలకోర్చి దరఖాస్తు చేసినా ఫలితం ఉండట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేపదే తిరస్కరణ గురవుతున్నాయని చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో రెవిన్యూ సదస్సుల్లో వినతులు కూడా పరిష్కారానికి నోచట్లేదు. 

దరఖాస్తుల పెండింగ్‌
   అంశం                                   దరఖాస్తులు    పరిష్కరించినవి    తిరస్కరించినవి      పెండింగ్‌
1. అడంగల్, 1బి సవరణలు         2,18,358        1,71,306          45,642              1410
2. మ్యుటేషన్, టైటిల్‌డీడ్, 
ఈపాస్‌ పుస్తకం కోసం (పాతవి)    1,52,498         85,652             65,602              1,244
3. మ్యుటేషన్, టైటిల్‌డీడ్,     
ఈపాస్‌ పుస్తకం (కొత్తవి)               1,594               3                        –                  1591  


ఆన్‌లైన్‌లో వివరాల్లేక ఇబ్బందులు
వెబ్‌ల్యాండ్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నాకు చెందిన ఒక ఎకరా భూమి వివరాలు అందులో లేవు. అవి కన్పించేలా చర్యలు చేపట్టాలని స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి పలుసార్లు ధరఖాస్తు చేసినా ప్రయోజనం లేదు. మా గ్రామంలో నాతోపాటు యారడి అప్పారావు, యారడి చిన్నకృష్ణమూర్తి, టెంక ఆనంద్, నారాయణపురం గ్రామానికి  చెందిన రత్నాల డొంబూరు తదితర రైతులది కూడా ఇదే సమస్య.
–యారడి వాసుదేవు, రైతు, 
గోకర్ణపురం గ్రామం, కంచిలి మండలం

ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నా
నాకు ఖాతా నెంబర్‌ 192, సర్వేనంబర్లు 57–7, 55, 48–2, 44–4(ఎ), 30లలో దాదాపు 13 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి వెబ్‌ల్యాండ్‌ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏడాదిగా తిరుగుతున్నా. మీ–సేవా కేంద్రాల ద్వారా పలుమార్లు అర్జీలు చేసుకున్నా ఫలితం లేదు. అధికా రులు నికర భూమిని నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సక్రమంగా జరగకపోవటం తో  నాలాంటి రైతులు ఎందరో రెవెన్యూ, మీ–సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
–కండాపు ప్రసాదరావు, రైతు, 
పీఆర్‌.రాజుపేట,పాలకొండ మండలం.


తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదు.....
సంతకవిటి తహశీల్దార్‌ కార్యాలయంలో అక్రమాలు అధికమయ్యాయి. వెబ్‌ అడంగల్‌కు ఇబ్బందులు పడుతున్నాం. పంటపొలాల సర్వేకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. సర్వేయర్‌లు అందుబాటులో ఉండడంలేదు. ముటేషన్లు చేయాలంటే అధికంగా చెల్లింపులు జరపాల్సి ఉంది. 
–ముదిలి అప్పలనాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement