‘స్మార్ట్’గా కొనేస్తున్నారు..
- వచ్చే ఏడాదికల్లా స్మార్ట్‌ఫోన్లతో షాపింగ్ 4 కోట్ల డాలర్లకు...
- అసోచాం, గ్రాంట్ థార్న్‌టన్ నివేదిక
ముంబై: స్మార్ట్‌ఫోన్ల ద్వారా జరిపే ఆన్‌లైన్ కొనుగోలు లావాదేవీలు 2016 నాటికి 4 కోట్ల డాలర్లకు చేరనున్నాయి. ప్రస్తుతం ఇది 3 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం వచ్చే మూడేళ్లలో మరో 20 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. వీరిలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ల ద్వారానే నెట్‌కు చేరువ కానున్నారు. అంతర్జాతీయంగా ఈ-కామర్స్ మార్కెట్లో ఆన్‌లైన్ ట్రావెల్ వ్యాపార విభాగం వాటా తక్కువగానే ఉన్నప్పటికీ భారత ఈ-కామర్స్ మార్కెట్లో మాత్రం దీనిదే సింహభాగం కానుంది.
ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే వారి సంఖ్య 2011లో 1.1 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాదికి ఈ సంఖ్య 3.8 కోట్లకు పెరగనుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. నెట్‌ను ఉపయోగిస్తున్న వారిలో 75 శాతం మంది 15-34 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉంటున్నారు. దేశీ ఈకామర్స్‌లో ఆన్‌లైన్ ట్రావెల్ వాటా 71 శాతంగా ఉంది. 2009-2013 మధ్య ఇది ఏటా 32 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. మరోవైపు, సంఘటిత రిటైల్ అమ్మకాల్లో ఆన్‌లైన్ రిటైలింగ్ వాటా కేవలం 8.7 శాతమే ఉంది. ఇక మొత్తం రిటైల్ అమ్మకాల్లో దీని వాటా 0.3 శాతమే.
2013లో ఈ-కామర్స్ మార్కెట్లో 26 శాతంగా ఉన్న మహిళల వాటా 2016 నాటికి 35 శాతానికి పెరగనుంది. భారత్‌లో 4,000-5,000 నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్ రిటైలింగ్‌కు భారీ డిమాండ్ ఉంది. భారీ రియల్ ఎస్టేట్ వ్యయాల కారణంగా సంఘటిత రిటైల్ రంగం అంచనాలకు అనుగుణమైన స్థాయిలో విస్తరణ చేపట్టలేకపోతున్నాయని నివేదిక వివరించింది. భారత ఈ-కామర్స్ మార్కెట్ 63 శాతం వార్షిక వృద్ధితో 2016 నాటికి 8.5 బిలియన్ డాలర్లకు చేరగలదని పేర్కొంది.