కాసుల కోసం కోతలు
ప్రైవేటు ఆసుపత్రుల్లో
పెరుగుతున్న సిజేరియన్లు
ప్రసూతి వైద్యంలో యాభై శాతానికి మించి శస్త్ర చికిత్సలు
తణుకు: కాసుల ముందు తల్లీబిడ్డల ఆరోగ్యం బలాదూర్ అవుతోంది. ప్రతి వంద ప్రసవాల్లో సిజేరియన్లు (అపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) 10 నుంచి 15 శాతం మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. జిల్లాలో మాత్రం ఇది 50 శాతం దాటుతోంది. ఇలా చేయడం వల్ల తలెత్తుతున్న దుష్పలితా లను ఎవరూ గుర్తించడం లేదు. కేవలం కాసుల కోసమే సుఖ ప్రసవాలు జరిగే కేసుల్లోనూ వైద్యులు గర్భిణుల ఉదరాన్ని కోసి.. బలవంతంగా బిడ్డను బయటకు తీసి ఆనక కోసిన చోట్ల కుట్లు వేస్తున్నారు. తద్వారా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యాభై శాతం సిజేరియన్లే..
ప్రస్తుతం సాధారణ ప్రసవం అనేది ఆరుదైన విషయంగా మారిపోయింది. కడుపుకోత పెడితే గానీ బిడ్డ బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టడం లేదు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో సైతం ప్రతి వంద ప్రసవాల్లో కనీసం యాభై కాన్పులు సిజేరియన్లే అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా కాసుల కోసం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోతలను తప్పనిసరి చేస్తున్నాయి. ఐదేళ్ల నుంచి ఈ మార్పు వేగంగా చోటు చేసుకుంటోంది.
జిల్లాలోని దాదాపు 250 వరకు ప్రైవేటు ప్రసూతి నర్సింగ్ హోమ్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే సరాసరి కనీసం రోజుకు ఒక్కో ఆసుపత్రిలో 10 నుంచి 12 మంది శిశువులు జన్మిస్తున్నారు. సహజ ప్రసవాలకు పెద్దపీట వేయాల్సిన వైద్యులు సమయం ఆదా కోసం కూడా సిజేరియన్లు వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు మంచి ముహూర్తం పేరిట గర్భిణి బంధువుల ఒత్తిళ్లు సైతం దీనికి కారణమవుతోంది.
వైద్యులు చెబుతున్న కారణాలివీ
కాన్పు సమయంలో తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం ఉం దని తెలిస్తే (హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు) సిజేరియన్ తప్పనిసరి అవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మంది గర్భిణులు పరిస్థితి విషమించే సమయంలోనే నర్సింగ్ హోమ్‌లకు వస్తుంటారని.. అంతకుముందు చిన్నస్థాయి ఆసుపత్రుల కు వెళుతుంటారని పేర్కొంటున్నారు. అక్కడ చేతులెత్తేస్తే హడావుడిగా పెద్దాసుపత్రులకు తీసుకువస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో సహజ ప్రసవం కోసం వేచి చూసే పరిస్థితి ఉండదంటున్నారు. ఇదిలావుంటే సిజేరియన్ అయితే వారం పది రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. ఈ పరిస్థితుల్లోనూ కొందరు వైద్యులు సిజేరియన్ చేసిన రెండు రోజులకే బాలింతలను ఇళ్లకు పంపేస్తున్నారు. శస్త్రచికిత్స గాయం మానకుండానే ఇంటికి పంపించేస్తుండటంతో ఒక్కోసారి ప్రాణం మీదకు వస్తోందని రోగులు చెబుతున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి
సిజేరియన్లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించిం ది. సిజేరియన్లు తగ్గించాలని నర్సింగ్ హోమ్‌లు, ప్రభుత్వాసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది.
సిజేరియన్ల వల్ల దుష్ఫలితాలు
సాధారణ ప్రసవమైనప్పుడు ఆ తల్లి మాతృత్వ అనుభూతి పొందగలుగుతుంది. ఆ అనుభూతి విలువ కట్టలేనంత గొప్పది. శస్త్రచికిత్స సమయంలో మత్తు ఇవ్వడం, ఇతరత్రా మందుల వల్ల కాన్పు అనంతరం దుష్పరిమాణాలు తలెత్తే ప్రమాదం ఉంది. మొదటి కాన్పులో శస చికిత్స చేస్తే రెండో కాన్పులోనూ చేయాలి. శస్త్రచికిత్స చేయించుకున్న వారు కనీసం వారం నుంచి 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలి. సిజేరియన్ కారణంగా బిడ్డలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటా యి. 20 శాతం కేసుల్లో బిడ్డకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా పుట్టిన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తల్లి నుంచి హార్మోన్లు సహజ సిద్ధంగా అందవు. అందువల్ల ప్రసవ సమయంలో శస్త్ర చికిత్స చేయించుకోవడం మంచిది కాదు. - ఎం.వీరాస్వామి, సివిల్ సర్జన్, తణుకు
సిజేరియన్లు తగ్గించాలని కోరాం
ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లలో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను హెచ్చరిస్తూ వస్తున్నాం. సిజేరియన్లు, సుఖప్రసవాల నిష్పత్తిని సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం.
- కేవీ శివనాగేంద్రరావు, డెప్యూటీ డీఎంహెచ్‌వో, తణుకు.