
చర్చించి.. వ్యతిరేకించాల్సిందే
ఏపీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు అశోక్‌బాబు
విజయనగరం/విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో పూర్తిస్థాయి చర్చ జరిపి వ్యతిరేకించాల్సిందేనని, అప్పుడే ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోతుందని ఏపీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. విజయనగరం, విశాఖలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐక్యకార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్‌లో అఖిలపక్షాల సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేల నుంచి ప్రత్యక్షంగా అఫిడవిట్లు స్వీకరించలా, లేక వ్యక్తిగతంగా తీసుకోవాలా అనే దానిపై ఈ సదస్సులో నిర్ణయిస్తామన్నారు. ప్రతి పంచాయతీలో సమైక్య తీర్మానం చేయించి ఆ ప్రతులను రాష్ర్టపతి, స్పీకర్, గవర్నర్‌లకు పంపిస్తామని చెప్పారు.
ఉద్యోగులు చేస్తున్న సమైక్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సీమాంధ్రుల మనోభావాలను కించపర్చే విధంగా వ్యవహరించిన కేంద్రమంత్రులు, ఎంపీల రాజకీయ భవిష్యత్‌ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, ఉద్యోగ సంఘాల్లో కొంత అసంతృప్తి ఉండడం సర్వసాధారణమని, ఏపీఎన్జీవో అసోసియేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయని అశోక్‌బాబు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఐక్యంగా పోరాడతామని, దీనికోసం వాదనలు, అభిప్రాయాలను పక్కన పెట్టాల్సిదేనని స్పష్టంచేశారు. నాయకుడు ఎవరైనా సమైక్య ఉద్యమం కొనసాగుతుందన్నారు.