గతంలో ఒక్క హామీ నిలబెట్టుకోని చంద్రబాబు
గాలిలో కలిసిన రైతు రుణమాఫీ
డ్వాక్రా రుణమాఫీదీ అదే తీరు
ఇంటికో ఉద్యోగం వట్టి మాటే
తాజాగా ఆరు హామీలు అంటే నమ్మేదెవరంటున్న జనం
అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చేయడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలానే 2014లో అలవి కాని హామీలు 650 వరకూ ఇచ్చేసి.. గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన ఆయన.. మేక వన్నె పులిలా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వస్తూ సూపర్ సిక్స్ పేరిట గుప్పిస్తున్న హామీలు ఏవిధంగా నమ్ముతామని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు.
బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. చంద్రబాబు మాటలు అమాయకంగా నమ్మిన చాలామంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చివరకు రుణ భారం తడిసి మోపెడై, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకుని అవమానాల పాలైన రైతులు, డ్వాక్రా మహిళలు లబోదిబోమన్నారు. తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల నుంచి ఇంటికి వచ్చేస్తుందని నమ్మి మోసపోయారు.
రైతులకు ‘బాబు’గారి జెల్ల
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. వారికి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. చివరకు అరకొరగా రూ.25 వేల లోపు మాత్రమే చేసి, మధ్యలోనే వదిలేసి, రైతులను నిలువునా ముంచేశారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను ఏవిధంగా నమ్మాలని రైతులు ప్రశి్నస్తున్నారు.
డ్వాక్రా మహిళలను మోసం చేశారిలా..
చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ ప్రకటించారు. అది నమ్మి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,10,336 స్వయం సహాయక సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు అప్పటికి తమపై ఉన్న రూ.1,07,107 కోట్ల రుణాలు మాఫీ అయిపోతాయని సంబరపడ్డారు. తీరా గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు చిల్లిగవ్వ కూడా మాఫీ చేయకుండా దగా చేశారు. దీంతో ఆయనకు ఓట్లేసి మోసపోయామని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేరిట ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా (రూ.2,500, రూ.3,500, రూ.4,000) రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా దానిని కొంతమందికే పరిమితం చేశారు. అది కూడా రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ చెక్కులు కాస్తా చెల్లుబాటు కాకుండా పోయాయి. వాటిని మహిళలు చిత్తుకాగితాల్లా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది.
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, కొంత మందికి మొక్కుబడిగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా కాపులకు రిజర్వేషన్, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్‌లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు గాలికొదిలేశారు.
ఇలా అప్పట్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా వంచించారు. చివరకు టీడీపీ అధికారి వెబ్‌సైట్ నుంచి నాడు ఇచ్చిన మేనిఫెస్టోను సైతం మాయం చేసేశారు. అప్పట్లో ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు.. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనం నిలదీస్తారనే జంకూ గొంకూ లేకుండా ఈ ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలు అంటూ మరోసారి చేస్తున్న ప్రచారాన్ని నమ్మబోమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు.
కూటమిలోని జనసేన, బీజేపీల తరఫున టీడీపీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ఇస్తున్న నాలుగు పేజీల బుక్‌లెట్‌ను చాలామంది ఏమాత్రం చూడకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు తీరుకు పూర్తి భిన్నంగా గత ఎన్నికల వేళ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేసిన వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment