విపక్షాల వల్లే రాష్ట్రానికీ దుస్థితి: టీజీ వెంకటేశ్
హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరఫున పదేళ్ల క్రితమే తాము డిమాండ్ చేశామని, తమ డిమాండ్‌ను అప్పుడెవరూ పట్టించుకోలేదని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. అలాగే మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని సూచించామని, తమ సూచనను పరిగణనలోకి తీసుకునుంటే ఇప్పుడీ సమస్య ఉండేది కాదని వ్యాఖ్యానించారు.
మంత్రి టీజీ వెంకటేశ్ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక పదో వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విపక్ష నేతలు ప్రజల అభీష్టాన్ని తెలుసుకోకుండా వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని కేంద్రం ఎదుట చెప్పబట్టే రాష్ట్రానికి ఇప్పుడీ దుస్థితి దాపురించిందని విమర్శించారు.
తెలంగాణ ఇవ్వమని, ఇచ్చినా ఇబ్బంది లేదని చెప్పిన విపక్షాలు ఇప్పుడు విభజన పాపాన్ని కేంద్ర ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని తప్పుపట్టారు. వీరి మోసాలను ప్రజలు మర్చిపోరన్నారు. ఆంటోని కమిటీని కలవాలో వద్దో ఇంకా నిర్ణయించలేదని టీజీ వెంకటేశ్ చెప్పారు.