సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయంపై అధిష్టానం వెనక్కితగ్గే పరిస్థితి కానరాకపోవటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం పెరుగుతోంది. ఓవైపు ప్రజల నుంచి ప్రతిఘటన, మరోవైపు అధిష్టాన పెద్దల నుంచి ఏమాత్రం సానుకూల సంకేతాలు కానరాని నేపథ్యంలో సీమాంధ్ర నేతలు సోమవారం ఢిల్లీలో ఏపీభవన్‌లో సమావేశమయ్యారు.
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, బాలరాజు, కొండ్రు మురళి, పితాని సత్యానారాయణ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అధిష్టానం పునరాలోచన చేస్తుందన్న నమ్మకం కలగటం లేదని.. ఈ దశలో మనకేం కావాలో కోరటం తప్ప మార్గం లేదని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు తలొగ్గక తప్పదని, అలాకాని పక్షంలో రాజకీయ నేతలే సంక్షోభాన్ని సృష్టించాలని మరికొందరు పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రమంత్రులు రాజీనామాలు చేసేందుకు ముందుకు వస్తే సంక్షోభం తప్పదని.. కేంద్రం కచ్చితంగా దిగివస్తుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డట్లు చెప్తున్నారు.
అయితే ఎలాంటి నిర్ణయాలు లేకుండా, భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక లేకుండానే ఈ సమావేశం ముగిసింది. అనంతరం ఆయా నేతలు.. ఏపీభవన్‌లోనే ఉన్న ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డిని విడివిడిగా కలసి మాట్లాడారు. చివరి ప్రయత్నంగా మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సహా ఇతర పెద్దలను కలసి సమైక్య రాష్ట్ర అవసరాన్ని మరోమారు తెలియజేస్తానని సీఎం ఈ సందర్భంగా వారికి చెప్పినట్లు తెలిసింది.
ఢిల్లీలో ఆందోళన చేస్తేనే కదలిక: టీజీ
రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ఆందోళనలు చేస్తే కేంద్రం నుంచి స్పందన వస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ ఏపీభవన్‌లో విలేకరులతో వ్యాఖ్యానించారు. విభజన నిర్ణయాన్ని అసెంబ్లీలో ఓడించేందుకే తామంతా పదవుల్లో కొనసాగుతున్నామని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. రాజీనామాలు ఆమోదించుకుంటే నష్టపోతామని సీఎం చెప్పినందునే పదవుల్లో ఉన్నామన్నారు. విభజన నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కి తగ్గుతుందని తాను భావించటం లేదని బాలరాజు వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో ఉండి సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్యలు హైకమాండ్‌కు తెలియజేస్తామని, పరిష్కరించాలని కోరతామన్నారు.
హస్తినలో కాంగ్రెస్ సీమాంధ్ర నేతల తర్జనభర్జన
Published Tue, Sep 24 2013 3:23 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement