ఒకవైపు ఖాళీ అవుతున్న పార్టీ..
మరోవైపు పోటీకి అభ్యర్థులే లేని పరిస్థితి
డీసీసీ అధ్యక్షులతో భేటీ అరుున బొత్స
కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదన్న నేతలు
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని ప్రచారం చేస్తున్న సమయంలో లోక్‌సభతో పాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకూ షెడ్యూల్ విడుదల కావడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఒకవైపు మున్సిపల్, మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడమెలాగో వారికి అంతుబట్టడం లేదు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోవడం, పార్టీకి పెద్ద దిక్కంటూ లేకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు వారిని బెంబేలెత్తిస్తున్నారుు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం, ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు చివరివరకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఈ సమయంలో ఎన్నికలను ఎదుర్కోలేమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్ వంటి పార్టీలతో పొత్తుకు అవకాశమున్నప్పటికీ సీమాంధ్రలో ఆ దారి కూడా లేదని వాపోతున్నారు. ఇటీవలి అనేక సర్వేలు సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని పేర్కొనడం నేతల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ తరఫున పోటీ చేయకుండా ముఖం చాటేసే యోచనలో ఉన్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ పెద్దలకు నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఆయనకు పలు సూచనలు అందినట్లు సమాచారం. సీమాంధ్రకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని హైకమాండ్ సూచించింది.
అందరిలోనూ నిరాశ, నిస్పృహే: ఈ నేపథ్యంలోనే బుధవారం బొత్స సీమాంధ్ర ప్రాంత డీసీసీల అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర నేతలతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ అంశాలపై చర్చించారు. జిల్లాల్లో పరిస్థితిపైనా ఆరా తీశారు. పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఈ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని నేతలంతా ముక్తకంఠంతో చెప్పారు. రాష్ట్ర విభజన పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిందన్నారు.
లోక్‌సభ బరిలో తాజా మాజీ మంత్రులు: రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర తాజా మాజీ మంత్రులను ఆ ప్రాంతంలో లోక్‌సభ అభ్యర్థులుగా పోటీ చేయించే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు బొత్స చెప్పారు. తాజా మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే సీమాంధ్రలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌కు కొంత ఊపు వస్తుందని, పదేళ్లుగా అధికారంలో ఉన్నందున అంగ, అర్ధబలంతో జనాన్ని సమీకరించగలరని డీసీసీల నేతలు సూచించడంతో బొత్స ఈ విషయం వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, డీసీసీ ప్రతినిధులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
అంతా అయోమయం..
Published Thu, Mar 6 2014 4:00 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement